Last Updated:

Meesho: 251 మందిని ఇంటికి పంపించనున్న ‘మీషో’

స్థూల ఆర్థిక పరిస్థితులు సవాల్‌గా మారడంతోనే ఉద్యోగుల తొలగింపు తప్పనిసరైందని మీషో సీఈఓ విదిత్‌ ఆత్రే పేర్కొన్నారు. ఉద్వాసనకు గురైన ఉద్యోగులు వారి మేనేజర్లతో వ్యక్తిగతంగా మాట్లాడే వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు.

Meesho: 251 మందిని ఇంటికి పంపించనున్న ‘మీషో’

Meesho: దేశీయ ఈ కామర్స్‌, యూనికార్న్‌ సంస్థ మీషో మరోసారి ఉద్యోగాల కోతలకు సిద్ధమైంది. కంపెనీలో పనిచేస్తున్న 251 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. అంటే ఇది మొత్తం సిబ్బందిలో 15 శాతానికి సమానం. ఈ మేరకు శుక్రవారం ఉద్యోగులకు అంతర్గత ఈ మెయిల్ ద్వారా  లేఆఫ్స్  విషయాన్ని తెలియజేసింది. ఏడాది గ్యాప్ లో మీషో ఉద్యోగులను తొలగించడం ఇది రెండో సారి. గతంలోనూ 250 మంది ఉద్యోగులను సంస్థ ఇంటికి పంపింది.

 

నియామకాల్లో పొరపాట్లు జరిగాయి: మీషో సీఈఓ(Meesho)

స్థూల ఆర్థిక పరిస్థితులు సవాల్‌గా మారడంతోనే ఉద్యోగుల తొలగింపు తప్పనిసరైందని మీషో సీఈఓ విదిత్‌ ఆత్రే పేర్కొన్నారు. ఉద్వాసనకు గురైన ఉద్యోగులు వారి మేనేజర్లతో వ్యక్తిగతంగా మాట్లాడే వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగుల నియామకాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందన్నారు. అదే విధంగా సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవడంలో కూడా కొన్ని తప్పులు జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమస్యలు నివారించడంలో మరింత మెరుగ్గా పనిచేయాల్సి ఉందని పేర్కొన్నారు.

 

పరిహారం అందిస్తాం.. (Meesho)

కాగా, ఉద్యోగం కోల్పోయిన సిబ్బందికి కంపెనీ తరఫున సహకారం అందిస్తామని ఆత్రే వెల్లడించారు. 2.5 నుంచి 9 నెలల వేతనాన్ని ఒకేసారి పరిహారంగా అందజేస్తామని తెలిపారు. ఉద్యోగుల పదవి, సంస్థలో పనిచేసిన కాలం, జీతం ఆధారంగా పరిహారం ఉంటుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా బీమా ప్రయోజనాలను కూడా కొనసాగిస్తామని తెలిపారు. కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడంలోనూ సంస్థ నుంచి సహకారం అందిస్తామన్నారు.