Last Updated:

India vs Australia: ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్.. కుప్పకూలిన భారత్

India vs Australia: ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్.. కుప్పకూలిన భారత్

Pink Ball Test in Adelaide india all out: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య అడిలైడ్ వేదికగా పింక్ బాల్ డే/నైట్ మ్యాచ్ జరుగుతోంది. రెండో టెస్టులో భాగంగా భారత్ టాస్ నెగ్గింది. ఈ మేరకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 180 పరుగులకే ఆలౌటైంది.

బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి బంతికే ఓపెనర్ యశస్వి జైస్వాల్(0) ఔట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభమన్ గిల్(31) పరుగుల వద్ద ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అంతకుముందు కేఎల్ రాహుల్(37) పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మెక్ స్వీనీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఎక్కువ సేపు ఉండలేకపోయాడు. స్టార్క్ వేసిన బంతిని ఆడే క్రమంలో స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో, రిషభ్ పంత్, కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చారు. మొదటి సెషన్ ఆట ముగిసేసరికి భారత్ 4 వికెట్లకు 82 పరుగులు చేసింది.

అయితే, రెండో సెషన్ ప్రారంభమైన మూడో ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ(3) ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. దీంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. తర్వాత కుదురుగా ఆడుతున్న రిషభ్ పంత్(21) ఔట్ అయ్యాడు. కమిన్స్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడే క్రమంలో లబుషేన్ చేతికి చిక్కాడు. క్రీజులోకి వచ్చిన అశ్విన్(22) దూకుడుగా ఆడాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అశ్విన్ ఎల్బీగా ఔట్ అయ్యాడు. తర్వాత బుమ్రా(0) ఔట్ కాగా, నితీశ్ రెడ్డి(42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లు పడగొట్టగా.. బోలాండ్, కమిన్స్ చెరో 2 వికెట్లు తీశారు. ఇక, ఫిలిప్ హ్యుజ్ 10 వ వర్ధంతి నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు నల్ల బ్యాడ్జ్‌లతో మైదానంలోకి అడుగుపెట్టారు. కాగా, భారత్ మూడు మార్పులు చేయగా.. ఆస్ట్రేలియా ఒక్క మార్పుతోనే బరిలోకి దిగింది.