IPL 2025 : మరోసారి రెచ్చిపోయిన ముంబయి బ్యాటర్లు.. లక్నో టార్గెట్ 216

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో లక్నోతో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడిన మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. రికెల్టన్ (58), అర్ధ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, 10 ఓవర్లకే ముంబయి ఇండియన్స్ స్కోర్ 105కు చేరింది. లక్నో బౌలర్లు పుంజుకొని వరుసగా వికెట్లు తీసినా ఫలితం లేదు. దీంతో సూర్యకుమార్ యాదవ్ (54) తనదైన షాట్లతో అలరించాడు. ఆఖరులో నమన్ ధిర్ (25 నాటౌట్), కార్బిన్ బాస్చ్ (20) ధనాధన్ ఆడి ముంబయి స్కోర్ 200 దాటించారు. అవేశ్ ఖాన్ వేసిన 20వ ఓవరులో లాస్ట్ బంతిని నమన్ స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో ముంబయి ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.
సూర్య కుమార్ మెరుపులు..
ప్రమాదకరంగా మారిన రికెల్టన్, జాక్స్ జోడిని దిగ్వేశ్ రథీ విడదీసి లక్నో జట్టుకు బ్రేక్ వేశాడు. కాసేపటికే జాక్స్‌ను ప్రిన్స్ యాదవ్ ఔట్ చేశాడు. వరుసగా 2 వికెట్లు పడినా సూర్య కుమార్ యాదవ్(54) రాకతో మళ్లీ ముంబయి స్కోర్‌బోర్డుకు రెక్కలొచ్చాయి. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(5)తో కలిసి ధాటిగా ఆడాడు. పాండ్యాను బౌల్డ్ చేసిన మయాంక్ ముంబయిని దెబ్బకొట్టాడు. తర్వాత ప్రిన్స్ వేసిన 16వ ఓవర్లో నమన్ ధిర్(25 నాటౌట్) వరుసగా 2 ఫోర్లు బాదాడు.