Online betting : ఆన్‌లైన్ బెట్టింగ్‌లు రాష్ట్ర పరిధిలోని అంశాలు : కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

Online betting : కేంద్రం రాష్ట్రాలకు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల అనేక మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ కీలక ప్రకటన చేశారు. గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంతటి వారైనా సరే.. ఉపేక్షించేది లేని తేల్చిచెప్పారు. తాజాగా కేంద్రం రాష్ట్రాలకు చట్టాలు చేసుకోవచ్చని వెల్లడించింది.
గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లు రాష్ట్ర పరిధిలోని అంశాలు అని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. బెట్టింగ్‌ల కట్టడికి కేంద్రం కూడా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తమిళనాడు సర్కారు ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించిందని, దీనిపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం తన నైతిక బాధ్యత నుంచి తప్పించుకుంటుందా..? అని మారన్ ఘాటుగా ప్రశ్నించారు. నిషేధం విధించడానికి ప్రభుత్వానికి ఎంత సమయం కావాలని అడిగారు.
ప్రశ్నకు కేంద్రమంత్రి వైష్ణవ్ సూటిగా సమాధానం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నైతికతను ప్రశ్నించే హక్కు లేదన్నారు. ఈ అంశంపై చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగం నైతిక, చట్టబద్ధ అధికారాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. దయచేసి సమాఖ్య నిర్మాణాన్ని అర్ధం చేసుకోవాలని సూచనలు చేశారు. రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినా తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 1410 గేమింగ్ కేంద్రాలను ఇప్పటికే నిషేధించామని వెల్లడించారు.
ఇటీవల కేంద్రం ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న వందల వెబ్‌సైట్లను ఆర్థిక శాఖ పరిధిలోని డీజీజీఐ బ్లాక్ చేసింది. గేమింగ్ సంస్థలకు చెందిన 2400 బ్యాంకు ఖాతాలు సీజ్ చేసి రూ.126 కోట్లను ఫ్రీజ్ చేసింది. మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల అప్రమత్తం ఉండాలని, వాటిని ఎవరూ కూడా వాడొద్దని డీజీజీఐ హెచ్చరించింది. సంస్థలను నమోదు చేయకుండా, ఆదాయాలను దాచిపెడుతూ జీఎస్టీ ఎగవేతలకు పాల్పడుతున్న ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకున్నామని, ఐటీశాఖ సమన్వయంతో వెబ్‌సైట్‌లను బ్లాక్ చేశామని కేంద్రం తెలిపింది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు గేమింగ్ సంస్థల ప్రచారంలో పాల్గొంటున్నారని గుర్తించామని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వాటికి దూరంగా ఉండాలని తెలిపింది. ప్లాట్‌ఫామ్‌లు వ్యక్తుల ఆర్థిక భద్రతను దెబ్బతీయవచ్చని, దేశ భద్రతను దెబ్బతీసే కార్యకలాపాలకు అవి పరోక్షంగా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని హెచ్చరించింది.