Published On:

Plane Crash: ఎయిర్ ఇండియా ప్రమాద బాధితుల కోసం ట్రస్ట్‌: టాటా సన్స్‌ బోర్డు అనుమతి

Plane Crash: ఎయిర్ ఇండియా ప్రమాద బాధితుల కోసం ట్రస్ట్‌: టాటా సన్స్‌ బోర్డు అనుమతి

Air India plane crash: ఎయిర్ ఇండియా విమానం AI 171 ప్రమాద బాధితులకు ఆర్థికసాయం అందించేలా ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని టాటా సన్స్‌ బోర్డును అనుమతి కోరింది. గురువారం జరిగిన కీలక భేటీలో ప్రతిపాదన తీసుకొచ్చినందుకు టాటా గ్రూప్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ సభ్యులను అభినందించినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ కథనంలో వెల్లడించింది. సమావేశానికి టాటా ట్రస్ట్‌ నామినీలు నోయల్‌ టాటా, వేణు శ్రీనివాసన్‌, విజయ్‌సింగ్‌ హాజరయ్యారు.

 

ట్రస్ట్‌కు రూ.500 కోట్లు కేటాయించేలా అనుమతులు కోరింది. వాస్తవానికి మొదట టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ అయిన టాటా సన్స్‌ రెండు వేర్వేరు ట్రస్ట్‌లను ఏర్పాటు చేయాలని భావించింది. ఒకటి భారతీయ బాధితుల కుటుంబాలను చూసుకొనేందుకు కాగా, మరొకొటి విదేశీ బాధితుల కుటుంబాల కోసం ఏర్పాటు చేయాలని భావించింది.

 

తాజాగా ట్రస్ట్‌కు కేటాయించే సొమ్ముతో 271 బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించడం, క్షతగాత్రుల వైద్య ఖర్చులు, మెడికల్‌ కళాశాల పునరుద్ధరణ, సమీపంలో విమాన శకలాల కారణంగా దెబ్బతిన్న వాటిని పునరుద్ధరించడం వంటి పనులు చేపట్టనుంది. మిగిలిన మూలనిధిని బాధిత కుటుంబాల అవసరాలు తీర్చడానికి వినియోగించాలని భావిస్తున్నారు. త్వరలో ట్రస్ట్‌ను రిజిస్టర్‌ చేసే అవకాశం ఉంది. ట్రస్ట్ భారత, విదేశీ బాధితుల కుటుంబాలకు సాయం చేస్తుంది. కార్యక్రమానికి టాటా మోటార్స్‌ సీఎఫ్‌వో పీబీ బాలాజీ నేతృత్వం వహించనున్నారు. అతడికి నియంత్రణ సంస్థలు, ఫైనాన్షియల్‌, కార్పొరేట్‌ గవర్నెన్స్‌లో మంచి అనుభవం ఉంది.

 

విమాన దుర్ఘటనను టాటా సంస్థ చాలా సీరియస్‌గా తీసుకొంది. ఎయిర్ ఇండియా రోజువారీ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతను నేరుగా టాటాసన్స్‌ చైర్మన్‌ తన చేతుల్లోకి తీసుకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. సంస్థకు దుర్ఘటన పెనుసవాలుగా మారడంతో నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంతో సంబంధాలు, ప్రయాణికుల భద్రతను అంచనా వేయడం, విమానాల నిర్వహణ, సిబ్బంది సంక్షేమం వంటివి అతడి పరిధిలోకి రానున్నాయి.

 

తమ సంస్థలు కష్టాల్లో ఉన్నప్పుడు చైర్మన్లు రంగంలోకి దిగి వాటిని ఎదుర్కోవడం టాటా గ్రూపులో ఎప్పటినుంచి వస్తున్న సంప్రదాయం. 1989లో టాటాస్టీల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకొని 50 మంది మృతిచెందారు. నాడు జేఆర్‌డీ టాటా స్వయంగా రంగంలోకి దిగి సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. టాటా ఫైనాన్స్‌ కుంభకోణం, 26/11 తాజ్‌ హోటల్‌పై ఉగ్రదాడి సందర్భంగా వ్యవహారాలన్నింటిని రతన్‌ టాటా పర్యవేక్షించారు. ఎన్‌.చంద్రశేఖరన్‌కు టీసీఎస్‌ను సంక్షోభాల నుంచి బయటపడేసిన రికార్డు ఉంది. తాజ్‌ హోటల్‌పై ఉగ్రదాడులు జరిగిన వేళ టాటా గ్రూప్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. బాధిత ఉద్యోగుల కుటుంబాలకు దీర్ఘకాలంగా ఆర్థిక, నైతిక మద్దతును అందించింది.

ఇవి కూడా చదవండి: