MK Stalin : పాంబన్ వంతెన ప్రారంభానికి సీఎం ఎంకే స్టాలిన్ గైర్హాజరు.. డీలిమిటేషనే కారణామా?

MK Stalin : తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ గైర్హాజరయ్యారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని కార్యక్రమానికి స్టాలిన్ హాజరుకాకపోవడం గమనార్హం.
డీలిమిటేషన్‌ను అమలు చేయాలని డిమాండ్..
తమిళనాడులోని రామేశ్వరంలో నూతన పాంబన్ వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించగా, అదేసమయంలో మరోచోట జరిగిన కార్యక్రమంలో పాల్గొని స్టాలిన్ మాట్లాడారు. లోక్ సభలో రాజ్యాంగ సవరణతో న్యాయమైన డీలిమిటేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రక్రియ విషయంలో తమిళ ప్రజలకు నెలకొన్న భయాలను తొలగిస్తానని ప్రధాని హామీ ఇవ్వాలని కోరారు. పార్లమెంటరీ సీట్లలో తమ రాష్ట్ర వాటా శాతంలో మార్పు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2001లో అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి పాటించిన నిబద్ధతను నిలబెట్టుకోవాలని సూచించారు. 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ అమలు చేస్తే తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాలు లోక్ సభలో న్యాయమైన ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
2026లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన..
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగనుంది. ఇందుకు అనుసరించే విధివిధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన కలుగుతోందన్నారు. ఇటీవల డీఎంకే నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల తయారీలో ప్రాతినిధ్యం తగ్గుతుందని సీఎం స్టాలిన్ ఆరోపించారు. సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామన్నారు. ఈ సందర్భంగా తమ నిరసన పునర్విభజనకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. న్యాయబద్ధంగా, పారదర్శకంగా డీలిమిటేషన్ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ ఆధునిక సాంకేతికతతో నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ క్రమంలోనే రామేశ్వరం-తాంబరం ప్రత్యేక రైలును ప్రారంభించగా, అది కొత్త వంతెన మీదుగా పరుగులు తీసింది.