PM Modi: ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం

PM Modi Comments On Emergency: దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సంవిధాన్ హత్యా దివస్ అభియాన్ నిర్వహిస్తోంది. కాగా దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం అని అభివర్ణించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్ చేసిందని చెప్పుకొచ్చారు. అత్యవసర పరిస్థితిని ఏ భారతీయుడు మరిచిపోలేరని.. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినవారికి మా సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించేందుకు.. రాజ్యాంగంలోని సూత్రాలను బలోపేతం చేస్తామని మోదీ అన్నారు. వికసిత్ భారత్ సాధించేందుకు కృష్టి చేస్తున్నామని, పేదలు, అణగారిన వర్గాల కలలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
దేశంలో 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రకు సంబంధించి చీకటి అధ్యాయాలలో ఒకటైన అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు గడిచాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టిన సమయమని తెలిపారు. “మన రాజ్యాంగం స్వరాన్ని ఎలా అణిచివేశారో ఏ భారతీయుడు మరిచి పోలేడు. పార్లమెంట్ స్వరాన్ని అణిచివేసి, కోర్టులను నియంత్రించడానికి ప్రయత్నాలు జరిగాయి. 42వ రాజ్యాంగ సవరణ వారి చర్యలకు ఉదాహరణ. పేదలు, అణగారిన వర్గాలు, దళితులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారు” అని అన్నారు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో దృఢంగా నిలిచిన ప్రతీఒక్కరికీ వందనం చేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య నిర్మాణం కోసం స్వాతంత్య్ర సమరయోధులు తమ జీవితాలను అంకితం చేశారని తెలిపారు. “మన రాజ్యంగంలో పొందుపరిచిన సూత్రాలను బలోపేతం చేయడానికి- అభివృద్ధి చెందిన భారతదేశం అనే మన కలను సాకారం చేసుకోవడానికి మనం కలిసి పనిచేస్తున్నాము. మనం పురోగతిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తాము. పేదలు, అణగారిన వర్గాల కలలను నెరవేర్చుతాము” అని ప్రధాని రాసుకొచ్చారు.
దేశ చరిత్రలో 1975 నుంచి 1977 వరకు చీకటి రోజులుగా మోడీ అభివర్ణించారు. ఆనాటి పరిస్థితులపై మోడీ రాజకీయ జీవితంపై బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ది ఎమర్జెన్సీ డైరీస్- ఇయర్స్ దట్ ఫోర్జ్డ్ ఏ లీడర్ పేరుతో కొత్త పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకంలో మోదీ వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, రాజకీయ నిరంకుశత్వాన్ని ప్రతిఘటించడంలో, ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో మోదీ పాత్ర ఏంటీ? అనే విషయాలు ఈ పుస్తకంలో వివరించారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీని ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మోదీ ఎలా ఎదుర్కొన్నారో.. వాటి గురించి పుస్తకాల్లో ప్రస్తావించారు.