Pahalgam: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్.. అందులో ఏముందంటే!

Simla Agreement: పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్, భారత్ మధ్య అంతరం పెరుగుతోంది. తాజాగా సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేసింది. 1971 ఇంగో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందం ఏర్పడింది. ఇది ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పి కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. యుద్దంలో పట్టుబడిన 90వేల మంది పాక్ సైనికులను భారత్ అప్పగించింది. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అందుకు ప్రతిస్పందనగా భారత విమానాలను పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ గుండా వెళ్లేందుకు నిరోధించింది. భారత్ తో అన్ని వ్యాపార మార్గాలను మూసివేసింది.
సిమ్లా ఒప్పందం
1971 ఇండో – పాకిస్తాన్ యుద్దంలో పాక్ కు చెందిన 90వేల మంది సైనికులు పట్టుబడ్డారు. పాకిస్తాన్ కు చెందిన అనేక భూభాగాలను భారత సైనికులు ఆక్రమించారు. భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలను నివారించడానికి ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరగాలని రెండు దేశాలు ముందుకు వచ్చాయి. అందులో భాగంగానే 1972లో సిమ్లా ఒప్పందం ఏర్పడింది. అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు.
సిమ్లా ఒప్పందంలోని ముఖ్య నిబంధనలు
90వేల మంది పాకిస్తాన్ ఖైదీలను భారత్ విడుదల చేయడానికి అంగీకరించింది.
మూడవ దేశం జోక్యం లేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం.
జమ్మూ కాశ్మీర్‌లోని కాల్పుల విరమణ రేఖను నియంత్రణ రేఖగా గుర్తించడం, ఏకపక్షంగా ఇరు దేశాలు మార్చకూడదు.
సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేయడం వలన నియంత్రణ రేఖపై దాయాది దేశం కాల్పులకు తెగబడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇప్పటికే రెండు దేశాలు తమ అమ్మలుపొదిలోని అస్త్రాలను ప్రయోగించాయి. పహల్గాం (Pahalgam terror attack) దాడిలో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు తెలిసింది. ఉగ్రవాదులను ఎలిమినేట్ చేస్తున్నాయి భద్రతా బలగాలు.