Mulayam Singh Yadav: ములాయంసింగ్ యాదవ్ ప్రధాని అయ్యే అవకాశాన్ని ఎలా కోల్పోయారో తెలుసా?
తన దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్దాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు.
Uttar Pradesh: తన దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్దాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు. 1989-91 మధ్య, తర్వాత 1993-95 నుండి మరియు మళ్లీ 2003-2007లో యూపీ సీఎంగా ఉన్నారు. కానీ అతను భారత ప్రధాని కావడానికి అవకాశం దగ్గరగా వచ్చి పోయింది.
1996 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖాతాలో 161 సీట్లు ఉన్నాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానాన్ని అంగీకరించారు. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినా 13 రోజులకే ఆయన ప్రభుత్వం పడిపోయింది. అప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారన్న ప్రశ్న తలెత్తింది. కాంగ్రెస్ పార్టీకి 141 సీట్లు ఉన్నప్పటికీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో లేదు. అందరి చూపు వీపీ సింగ్ వైపు మళ్లింది. 1989లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఈసారి ప్రధాని పదవిని నిరాకరించి అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరును ముందుకు తెచ్చారు. అయితే వీపీ సింగ్ ప్రతిపాదనను సీపీఎం పొలిట్‌బ్యూరో తిరస్కరించింది.
దీని తర్వాత ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ పేర్లు తెర పైకి వచ్చాయి. దాణా కుంభకోణంలో పేరు రావడంతో లాలూ ప్రధాని రేసు నుంచి తప్పుకున్నారు. సంకీర్ణాన్ని ఏర్పరిచే బాధ్యతను వామపక్ష నేత సుర్జిత్ కు అప్పగించారు. దీనితో ఆయన ప్రధానమంత్రి పదవికి ములాయం పేరును ప్రతిపాదించారు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ మరియు శరద్ యాదవ్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా నేతాజీగా పిలవబడే ములాయం సింగ్ యాదవ్ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయారు.