Published On:

Supreme court : పార్టీ మారిన ఎమ్మెల్యే తీర్పు రిజర్వు.. సుప్రీంలో ముగిసిన విచారణ

Supreme court : పార్టీ మారిన ఎమ్మెల్యే తీర్పు రిజర్వు.. సుప్రీంలో ముగిసిన విచారణ

Supreme court : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్‌ చేస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగింది. స్పీకర్‌ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. కౌశిక్‌రెడ్డి తరఫున ఆర్యామ సుందరం వాదించారు. అనంతరం ఇరుపక్షాల వాదనలను ముగించిన ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.

 

 

అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు..
విచారణలో మొదటగా అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి తీర్పులు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పందించారు. మీ దృష్టిలో రీజనబుల్‌ టైం అంటే ఏంటని సింఘ్వీని ప్రశ్నించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని పేర్కొంది. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని వ్యాఖ్యానించారు.

 

 

 

కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు..
ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది ఆర్యామ సుందరం మరోసారి ప్రస్తావించారు. ఉప ఎన్నికలు రావు.. స్పీకర్‌ తరఫున కూడా చెబుతున్నానని ఆయన వ్యాఖ్యానించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందన్నారు. దీనిపై జస్టిస్‌ గవాయ్‌ స్పందిస్తూ ముఖ్యమంత్రి కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా? గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందదని, ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా? అని ప్రశ్నించారు.

 

 

ప్రతిపక్షం రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ఈ క్రమంలో అభిషేక్‌ మనుసింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం అని ధర్మాసనం వాటిని పక్కన పెట్టిందని, ముఖ్యమంత్రి రేవంత్ మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్‌ గవాయ్‌ అన్నారు. తాము సంయమనం పాటిస్తున్నామని, మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలని వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టులో కేసులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూశారని సింఘ్వీ పేర్కొన్నారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని జస్టిస్‌ గవాయ్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి: