Last Updated:

Harish Rao : ఇప్ప‌టికైనా కాంగ్రెస్ నేత‌లు క‌ళ్లు తెర‌వాలి : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

Harish Rao : ఇప్ప‌టికైనా కాంగ్రెస్ నేత‌లు క‌ళ్లు తెర‌వాలి : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

Harish Rao : కాళేశ్వ‌రం తెలంగాణ వ‌ర‌ప్ర‌దాయిని అని, కాళేశ్వరం కుంగింది అన్నవారికి, నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు కోరారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు కండ్లు తెరవాలని, లేకపోతే చరిత్ర క్షమించదన్నారు. బుధవారం రంగనాయక సాగర్ ప్రాజెక్టును ఆయన సంద‌ర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. రంగనాయక సాగర్‌లోకి కాళేశ్వరం పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో రైతులు పంట సాగుచేస్తున్నారని తెలిపారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని మంత్రికి విజ్ఞప్తి చేయగా, అనంతసాగర్ నుంచి 1 టీఎంసీ నీళ్లను రంగనాయక సాగర్‌కు వదిలారని తెలిపారు.

బీఆర్ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం..
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను రేవంత్ సర్కారు తుడిచిపెట్టాలని చూస్తుందని ఆరోపించారు. ఎస్సారెస్పీ స్టేజ్-2లో తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, భూపాలపల్లి ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయని, ఎస్సారెస్పీ నీరు తగ్గినప్పటికీ కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశామని గుర్తుచేశారు. కాళేశ్వరంలో 15 రిజర్వాయర్లు బాగున్నాయని చెప్పారు. 23 కిలోమీటర్ల టన్నెల్స్‌, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, ప్రెజర్ మైన్లు బాగున్నాయని కొనియాడారు. మేడిగడ్డలో ఏడు బ్లాకులు ఉన్నాయని, అందులో ఒక్క బ్లాక్‌లో ఒక్క పిల్లర్ మాత్రమే కుంగిపోయిందన్నారు. కాంగ్రెస్ నేతలు గోరంతను కొండంత చేసి బీఆర్ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

పంట కాల్వ పనులు పూర్తి చేయాలి..
ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయిందని, 15 నెలల్లో మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేసే తీరిక ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, నీళ్లను లిఫ్ట్ చేసి లక్షల ఎకరాల పంటను కాపాడే అవకాశం ఉందన్నారు. కేసీఆర్‌పై కోపంతో రైతులకు అన్యాయం చేయొద్దన్నారు. ఈ ప్రాంతంలో 500-1000 ఫీట్ల బోర్లు వేసినా నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదని, ఈ రోజు రంగనాయక సాగర్, అనంతసాగర్, మల్లన్న సాగర్ కింద పండే పంట కాళేశ్వరం పంట కాదా అని ప్రశ్నించారు. కళ్లు ఉండి కల్లు లేని కబోధుల్లా, చెవులు ఉండి చెవిటివాళ్లలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిప‌డ్డారు. పెండింగ్‌లో ఉన్న పంట కాల్వ పనులు పూర్తి చేయాలని కోరారు. రైతులతోపాటు మత్స్య సంపద కూడా పెరిగి, మత్స్యకారులకు ఆదాయం వస్తుందని చెప్పారు. అన్నివర్గాలకు మంచిచేసే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.

ఇవి కూడా చదవండి: