Rahul Gandhi: రాజకీయాలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. పదేళ్లలో మారిపోయాయి!

Congress Leader Rahul Gandhi Sentational Comments About Politics: ప్రస్తుత రాజకీయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తొలుత పహల్గామ్ దాడి మృతులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. పహల్గామ్ దాడి బాధాకరమన్నారు. ఈ దాడి జరిగిన తర్వాత కశ్మీర్ వెళ్లడంతో సమ్మిట్‌కు శుక్రవారం రాలేకపోయినట్లు వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయన్నారు. పదేళ్ల క్రితం ఉన్న రాజకీయాలకు ఇప్పటికీ ఎంతో తేడా ఉందన్నారు. పాతతరం రాజకీయం అంతరించిపోయిందని, ఇప్పుడంతా కొత్తతరం రాజకీయం నడుస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. చట్టసభల్లో విపక్షాలకు మాట్లాడే అవకాశం రావడం లేదని చెప్పారు. ఆధునిక సామాజిక మాధ్యమాల్లో అంతా మారిపోయిందని, రాజకీయాల్లోకి కొత్తతరం రావాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.
భారత్ జోడో యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నానని పేర్కొన్నారు. విపక్ష పార్టీలు ప్రపంచ వ్యాప్తంగా అణిచివేతను ఎదుర్కొంటున్నాయన్నారు. విపక్షాల వాదన వినిపించేందుకు కొత్త వేదికలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాగా, పాదయాత్ర మొదలు పెట్టకముందు ఆలోచించాను.. మొదలు పెట్టాక వెనకడుగు వేయలేదని రాహుల్ గాంధీ అన్నారు. కన్యాకుమారి నుంచి సుమారు 4 వేల కిలోమీటర్లు పాదయాద్ర చేశానని వెల్లడించారు.
దేశంలో మహిళలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సమస్యల పరిష్కారానికి ప్రజలే మార్గం చూపిస్తున్నారన్నారు. నాయకులు కైడా ప్రజలు చూపించిన మార్గంలోనే వెళ్లాలని సూచించారు. భారత్ జోడో యాత్రలో దేశ ప్రజలు నాపై ఎంతో ప్రేమ చూపించారని గుర్తు చేశారు. ప్రజలకు ద్వేషాన్ని కాదు.. ప్రేమను పంచాలని రాహుల్ గాంధీ సూచించారు.