SLBC Tunnel : మృతదేహాల వెలికితీతకు బ్రేక్?.. ఎస్ఎల్బీసీలో డేంజర్ జోన్

SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరి మృతదేహాలను వెలికితీసిన సంగతి తెలిసిందే. మిగిలిన 6 మంది మృతదేహాల వెలికితీతకు బ్రేక్ పడింది. ఇప్పటివరకు 281 మీటర్లలో పేరుకుపోయిన మట్టి, బండ రాళ్లను తొలగించారు. లోకో రైలు, కన్వేయర్ బెల్టు ద్వారా బయటికి తరలించారు. మిగిలిన 43 మీటర్లలో తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా, ప్రమాదకర పరిస్థితి నెలకొంది. దీంతో మృతదేహాల వెలికితీత నిలిచిపోయింది. కేవలం టన్నెల్లో వాటర్గ్ ప్రక్రియ, మట్టి, స్టిల్ కటింగ్‌లను బయటికి పంపుతున్నారు.
డేంజర్ జోన్..
టన్నెల్‌లో డేంజర్ జోన్‌లో ఉన్న మృతదేహాలను బయటకి తీయాలంటే తెలంగాణ సర్కారు తీసుకునే నిర్ణయంపై ఆదారపడి ఉంది. సర్కారు తీసుకునే నిర్ణయం కోసం బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఎస్ఎల్‌బీ టన్నెల్‌లో ప్రమాదం జరిగి 60 రోజులు అవుతుంది. 6 మంది మృతదేహాలు డేంజర్ జోన్‌లోనే ఉంటాయని భావిస్తున్నారు. డేంజర్ జోన్‌లో తవ్వకాలు చేపట్టానికి అవకాశం లేదు. అక్కడి వరకు తవ్వకాలు చేపట్టి, మృతదేహాల కోసం అన్వేషణ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మిగిలిన డేంజర్ జోన్ 43 మీటర్లు పరిధిలో మృతదేహాలు ఉంటాయని భావిస్తున్నారు. ప్రమాదం జోన్‌లోకి వెళ్తే సహాయక సిబ్బంది ప్రాణాలకే ముప్పు కావడంతో అక్కడి వరకే అన్వేషణ చేశారు.
మృతదేహల వెలికితీత ఎలా?..
ప్రమాదం జోన్‌లోకి వెళ్లలేని ప్రమాదకర పరిస్థితి ఏర్పడడంతో మృతదేహల వెలికితీత ఎలా? అనేది ఈ నెల 24న హైదరాబాద్‌లో జరిగే టెక్నికల్, నిపుణుల కమిటీ తేల్చనున్నది. అప్పటివరకు సొరంగంలో మిగిలిన మట్టి, బురద, స్టీల్, రాళ్లు తొలగింపు పనులు కొనసాగించనున్నారు. డివాటరింగ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. స్టీల్ కత్తిరింపు, బండరాళ్లును లోకో రైలు ద్వారా బయటకు తరలిస్తున్నారు. మృతదేహాల కోసం డేంజర్ జోన్ తప్ప.. మిగిలిన ప్రదేశాల్లో తవ్వకాలు ముగిసాయి. టెక్నికల్ కమిటీ తదుపరి చర్యలపై సమీక్షించి తెలంగాణ సర్కారుకు నివేదిక ఇవ్వనున్నది. సర్కారు తీసుకునే నిర్ణయం బట్టి డేంజర్ జోన్‌లో తవ్వకాలు చేపట్టనున్నారు.
మృతుల కుటుంబాలకు నిరాశ?
టన్నెల్‌లో పనిచేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు, సిబ్బంది తరలివచ్చారు. ఇందులో చాలా కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. వారి కుటుంబాలకు ఆసరాగా ఉపాధి నిమిత్తం రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చారు. సొరంగంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన కార్మికులు, ఇంజినీర్లు, మిషన్ ఆపరేటర్ల కుటుంబాలు కడసారి చూపుకోసం ఎదురుచూస్తున్నారు. 8 మందిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన 6 మంది మృతదేహాల కోసం కుటుంబాలు ఎదురుచూసినా ఉపయోగం లేకుండా పోయింది.
మంత్రుల హడావుడి..
సొరంగంలో జరిగిన ప్రమాదం సందర్భంగా మొదట్లో ప్రభుత్వం, మంత్రులు హెలికాప్టర్లలో వచ్చి అంత హడావుడి చేసి కొన్నిరోజుల తర్వాత అధికారులకు అప్పగించారు. డేంజర్ జోన్ ప్రమాదకర పరిస్థితి లేకపోతే కచ్చితంగా శ్రమించి మృతదేహాలు బయటకు తెచ్చేవారమని రెస్య్కూ సిబ్బంది తెలిపారు. డేంజర్ జోన్‌లోకి వెళ్లడం అతికష్టంగా మారడంతో వెళ్లలేకపోతున్నామని, ఒకవేళ ప్రయత్నాలు చేసినా పైనుంచి కూలిపడే ప్రమాదం ఉందని తెలిపారు.