Amnesty to Prisioners: 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న వారిని విడుదల చేయాలంటూ ఖైదీల కుటుంబసభ్యులు.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాపాలనలో దరఖాస్తులు అందజేశారు.
Amnesty to Prisioners: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న వారిని విడుదల చేయాలంటూ ఖైదీల కుటుంబసభ్యులు.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాపాలనలో దరఖాస్తులు అందజేశారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకు గల అవకాశాలను పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించారు. ఆ దరఖాస్తులను పరిశీలించిన సీనియర్ అధికారులు అర్హులైనవారి వివరాలను ఉన్నతస్థాయి కమిటీ ముందుంచారు.
క్యాబినెట్ ఆమోదం..(Amnesty to Prisioners)
ఇక కమిటీ ఆ వివరాలను పరిశీలించి విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాను క్యాబినెట్ ముందుంచింది. సీఎం రేవంత్ నేతృత్వంలోని క్యాబినెట్ వారి విడుదలకు పచ్చజెండా ఊపింది. అనంతరం ఆ జాబితాకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో.. ఖైదీల ముందస్తు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం చర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు నేడు విడుదలకానున్నారు. వీరిలో 205 మంది యావజ్జీవ శిక్ష పడిన వారు, ఎనిమిది మంది తక్కువ కాలం శిక్షపడిన వారు. వీరందరికి జైలులో వివిధ వృత్తులకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇచ్చారు. మెరుగైన ప్రవర్తన ద్వారా సమాజంలో తిరిగి కలిసిపోవడానికి వారందరికీ కౌన్సెలింగ్ ఇప్పించారు.