Last Updated:

BRS Defeat: తెలంగాణలో ’కారు‘ పంక్చర్ అవడానికి కారణాలేమిటో తెలుసా ?

తెలంగాణ సాధించిన నేతగా చరిత్రలో తన కంటూ స్దానం సాధించిన కేసీఆర్ రెండు సార్లు ప్రత్యేక తెలంగాణకు సీఎంగా వ్యవహరించారు. తెలంగాణ సెంటిమెంట్ తో 2014లో, సంక్షేమ పధకాల అమలుతో 2018లో అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ కు 2023 ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దీనివెనుక కారణాలేమిటన్న దానిపై ప్రైమ్ 9 ఎనాలిసిస్..

BRS Defeat:  తెలంగాణలో ’కారు‘ పంక్చర్ అవడానికి కారణాలేమిటో తెలుసా ?

 BRS Defeat: తెలంగాణ సాధించిన నేతగా చరిత్రలో తన కంటూ స్దానం సాధించిన కేసీఆర్ రెండు సార్లు తెలంగాణకు సీఎంగా వ్యవహరించారు. తెలంగాణ సెంటిమెంట్ తో 2014లో, సంక్షేమ పధకాల అమలుతో 2018లో అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ కు 2023 ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దీనివెనుక కారణాలేమిటన్న దానిపై ప్రైమ్ 9 ఎనాలిసిస్..

పధకాల పేరుతో..( BRS Defeat)

ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత అందరూ చెప్పేది కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇవ్వడం పెద్ద తప్పిదం. పదేళ్లనుంచి తమ తమ నియోజక వర్గాల్లో మకుటం లేని మహారాజుల్లా ఉన్న ఈ ఎమ్మెల్యేలు నియంతల్లా వ్యవహరించారు. పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. దీనికి తోడు ఫించన్లను మినహాయిస్తే మిగిలిన ఏ ప్రభుత్వ పధకాలు కూడా ప్రజలకు పూర్తిగా సంతృప్త స్దాయిలో చేరలేదు. ఐదేళ్ల కిందట ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ పధకం ఆచరణలో ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లు తయారియింది. ఇచ్చిన ఇళ్లు కూడా తమ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారన్న అపప్రధ మిగిలింది. హూజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ నుంచి వెలువడిన మరో పధకం దళిత బంధు. ఇది కూడా జిల్లాల వారిగా చాలా తక్కువమందికే పరిమితయింది. బీసీ బంధు పధకం ప్రకటించి దరఖాస్తులు హడావుడిగా తీసుకున్నారు. దరఖాస్తు దారులు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు తీసుకునే సమయం కూడా లేకుండా డెడ్ లైన్ ముగిసిందని చెప్పారు. పోడు భూముల పట్టాలు కూడ తమ వారికే అందించుకున్నారు. దీనితో ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి బయలు దేరింది. బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే వాటిలో ముఖ్యమైనవి కరెంటు, నీళ్లు. ఎన్నికల ముందే మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో అధికార పార్టీ ఢిపెన్స్ లో పడింది. సుమారుగా లక్ష కోట్ల రూపాయల వ్యయంతో గోదావరినే మళ్లించి లక్షలాది ఎకరాలు సాగులోకి తెచ్చామని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ నేతలు దీనిపై సైలెంట్ అయిపోయారు. కరెంటు, నీరు అందుబాటులో ఉండటంతో తెలంగాణ వ్యాప్తంగా వరిసాగు పెరిగింది. అయితే పండిన ధాన్యం కొనడానికి రకరకాల కొర్రీలు వేస్తూ రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అకాల వర్షాలు పడి పంటలు మునిగినా, తడిపిపోయినా పట్టించుకున్న దిక్కులేదు. రైతుబంధు పధకం పెద్ద రైతులు, భూ యజమానులకే ఉపయోగం అన్న భావన బలపడింది. ధరణితో రైతుల ఇబ్బందులు పెరిగాయి. వాటిని సరిచేసుకోవాలంటే జిల్లా కలెక్టర్ నుంచి హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం చుట్టూ తిరగవలసిందే. వీఆర్ఓ, వీఆర్ఏ లను తీసివేసి రెవెన్యూ వ్యవస్దకు ఒక దిశ లేకుండా చేసారు. తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పెరిగిందని గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతుల నిజమైన ఇబ్బందుల పట్ల సీరియస్ గా దృష్టి పెట్టిందిలేదు. దీనికితోడు అసెన్డ్, అటవీ, దేవాదాయ భూములను అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆక్రమించుకున్నారు.

యువత, ఉద్యోగులకు మొండిచేయి..

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకమైనది నియామకాలు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం ఏర్పడుతుందని ప్రచారం చేసారు. దీనితో ఉద్యమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొంది. సుమారుగా 1200 మంది వరకూ ప్రాణాలు కూడా కోల్పోయారు.అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ రంగంలో నియామకాలు ఆశించిన స్దాయిలో జరగలేదు. రెండేళ్లకిందట కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేసీఆర్ తెలంగాణలో జోనల్ వ్యవస్దను ఏర్పాటు చేసారు. అయితే తరువాత వరుస నియామకాలు చేపట్టలేదు. నోటిఫికేషన్లు తక్కువ. వెలువడిన తరువాత కూడా పేపర్ లీకేజీలు జరగడం యువతను తీవ్ర నిరాశలో ముంచింది. ఏళ్ల తరబడి అప్పులు చేసుకుంటూ హైదరాబాద్ లో పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు ఉద్యోగాలు ఇవ్వదని డిసైడయిపోయారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగలది కూడా కీలకపాత్రే. అయితే తెలంగాణ ఏర్పడ్డాక తమకు ఈ ప్రభుత్వ హయాంలో సరైన న్యాయం జరగలేదన్న భావన వారిలో పెరిగింది. ఉపాధ్యాయుల బదిలీలలో నిబంధనలను మార్చాలని ఎంతగానో మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోలేదు. చివరకు ఉద్యోగులు ప్రతీ నెలా 1వ తారీఖున జీతానికి కూడా నోచుకోలేదు. జిల్లాకు ఒక  మెడికల్ కాలేజీ తెచ్చామని గొప్పలు చెప్పుకున్నా ఉన్న ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలు మెరుగుపరచలేకపోయారు. కరోనా సమయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. స్దానిక సంస్దల నిధులు దారి మళ్లించడం, వారికి ఇవ్వాల్సిన కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ సర్పంచులు గత కొద్దికాలంగా నిరసనలు, ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎంతసేపు హైదరాబాద్ వెలిగిపోతుందని చూపిస్తూ అది తమ ప్రతిభే అంటూ చెప్పుకోవడం కొనసాగించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెద్ద ఎత్తున ప్రబలింది. పైస లివ్వనిదే ఏ పని జరగని పరిస్దితి నెలకొంది.

ఇక ప్రధానంగా చెప్పుకోవలసింది కేసీఆర్ వ్యవహార శైలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరినైనా సరే తను కలువాలనుకుంటే తప్ప ఆయన ఎవరినీ కలవరు.సీఎం తరపున కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావులు అధికార యంత్రాంగంపై పెత్తనం కొనసాగించారు. తెలంగాణ వచ్చింది కేవలం కేసీఆర్ కుటుంబం బాగుపడటానికే అన్న ప్రతిపక్షాల విమర్శలు నిజమే అన్నట్లుగా వారి వ్యవహారశైలి కొనసాగింది. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదు. దానికితోడు ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నవారిని ప్రభుత్వంలో మంత్రులుగా కూడా చేసారు. నిజానికి 2019 పార్లమెంట్ ఎన్నికలు, 2020 గ్రేటర్ ఎన్నికల్లోనే కేసీఆర్ సర్కార్ కు ప్రజల అసంతృప్తి సెగ తగిలింది. అయితే వాటిని నిర్లక్ష్యం చేయడంతో ఇపుడు అసెంబ్లీ ఎన్నికల్లో మూల్యం చెల్లించవలసి వచ్చింది.