Speaker Ayyanna Patrudu: త్వరలో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు.. ఒక్కడి కోసం రూల్ మారదు!
![Speaker Ayyanna Patrudu: త్వరలో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు.. ఒక్కడి కోసం రూల్ మారదు!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/ap.webp)
Speaker Ayyanna Patrudu says ys Jagan should conduct himself in Assembly as per rules: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా సభకు రాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలను నియంత్రించాలని చూడటం విడ్డూరంగా ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. శాసనసభ ప్రమాణాలను పెంచేందుకు త్వరలో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని ఆయన ఢిల్లీలో ప్రకటించారు. సోమవారం న్యూఢిల్లీలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో కలిసి స్పీకర్ అయ్యన్నపాత్రుడు విలేకర్లతో మాట్లాడారు.
ఇదెక్కడి విడ్డూరం?
సభకు హాజరుకావాలంటూ తాను స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆయనకు సూచించానని చెప్పారు. కానీ ఎమ్మెల్యేగా తన బాధ్యతను విస్మరించి, ఆయన అసెంబ్లీకి రాకుండా.. తన ప్యాలెస్‌లో కూర్చొని మాట్లాడుతున్నారని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా అసెంబ్లీలో సీఎంతో సమానంగా తనకూ సమయం కేటాయించాలని డిమాండ్ చేయటం విడ్డూరంగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రూల్ రూలే..
తగిన బలం లేని జగన్…తనకు విపక్ష హోదా కోరటం విచిత్రంగా ఉందని, మాజీ సీఎంకు ఈ మాత్రం చట్టాలు, రూల్స్ మీద అవగాహన లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఆయన కోసం చట్టాలు, నిబంధనలు మార్చలేమని స్పష్టం చేశారు. అలాగే, ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి స్పీకర్ అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే అతనిపై చర్యలు తీసుకోవచ్చని, అలాంటి సందర్భాల్లో గైర్హాజరీకి సరైన కారణాన్ని పేర్కొంటూ స్పీకర్‌కు లేఖ ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇకనైనా, జగన్ సభకు హాజరై ప్రజాసమస్యల మీద చర్చించాలని కోరారు.
శిక్షణా తరగతులు
గత అసెంబ్లీ ఎన్నికల్లో 175 మందిలో 84 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై… అసెంబ్లీలో అడుగు పెట్టారని, ఈ నేపథ్యంలో వారందరికీ చట్టసభల్లో ఎలా వ్యవహరించాలనే అంశంపై శిక్షణ ఇస్తే బావుంటుందనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేల శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు విచక్షణ రహితంగా మాట్లాడారని, ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు సభలో ఎంత హుందాగా ఉండాలి? ప్రజా సమస్యలపై సభలో ఎలా ప్రతిస్పందించాలి? అనే అంశాల మీద ఫోకస్ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కోరామని.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్‌తో బాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడినీ ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
రెండు రోజుల పాటు సెషన్
ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించామని స్పీకర్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం 61 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. కానీ, కూటమి సర్కారు ఏడాదికి కనీసం..75 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. అప్పుడే శాసన సభ్యులు.. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. , ఈ లోగానే ఎమ్మెల్యేలకు విజయవాడలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.