Published On:

AP CM Chandrababu : ఏ వ్యక్తీ పేదరికంలో ఉండొద్దు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

AP CM Chandrababu : ఏ వ్యక్తీ పేదరికంలో ఉండొద్దు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

AP CM Chandrababu: జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తితో కూటమి సర్కారు పనిచేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం ఎన్టీఆర్‌ జిల్లా ముప్పాళ్లలో సీఎం పర్యటించారు. జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో ఆయన మాట్లాడారు.

 

 

ఏపీ అభివృద్ధికి నూతన ఆలోచనలు..
ఏపీ అభివృద్ధికి ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. జన్మభూమి పిలుపునిచ్చినప్పుడు అందరూ స్పందించారని గుర్తుచేశారు. ఆర్థికంగా పైకి వచ్చినవాళ్లు సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలని కోరారు. అట్టడుగున ఉన్నవారికి చేయూత ఇవ్వాలన్నారు. తాను ఎప్పుడూ భవిష్యత్ కోసం రాబోయే 20-30 ఏళ్లకు ముందే ఆలోచిస్తానని చెప్పారు. దేశంలో పుట్టిన ఏ వ్యక్తీ పేదరికంలో ఉండటానికి వీల్లేదని చెప్పారు. పేదరిక నిర్మూలన జరగాలని స్పష్టం చేశారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్‌ అగ్రగామిగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదల సేవలో భాగంగా ప్రతినెలా 1వ తేదీన పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు.

 

 

సంపద సృష్టించి, ఆదాయం పెంచాలి..
గత వైసీపీ ప్రభుత్వం మన నెత్తిన అప్పులు పెట్టి వెళ్లిపోయిందని దుయ్యబట్టారు. సంపద సృష్టించి, ఆదాయం పెంచాలన్నారు. పీ-4 కార్యక్రమం ఓ అద్భుతమని కొనియాడారు. ప్రపంచంలో ఎక్కడా ఈ తరహా కార్యక్రమం జరగలేదని స్పష్టం చేశారు. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని, వీటిని తగ్గించాలన్నారు. 8 సార్లు ఎమ్మెల్యేగా, 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పారు. తన రికార్డులు బద్దలు కొట్టడం ఎవరికీ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఎస్సీల్లో వర్గీకరణ జరగాలని 30 ఏళ్ల కింద నిర్ణయించామని తెలిపారు. బాబు జగ్జీవన్‌రామ్‌ ఆశయాలను సాధిస్తామని హామీనిచ్చారు. ‘బాబు జగ్జీవన్‌రామ్‌’ పథకం కింద ఎస్సీలకు 2 కిలోవాట్స్‌ సోలార్‌ విద్యుత్‌ అందిస్తామని తెలిపారు. 100 శాతం ఎస్సీ, బీసీల పిల్లలకు గురుకుల విద్య అందిస్తామని, ఎస్సీల్లో నైపుణ్య శిక్షణ పెంపొందిస్తామన్నారు.

 

 

అన్ని గ్రామాల్లో రోడ్లు బాగు చేశాం..
అన్ని గ్రామాల్లో రోడ్లు బాగు చేశామని పేర్కొన్నారు. ఇది మంచి మార్పు అన్నారు. వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ కోసం రూ.15 కోట్లు మంజూరు చేస్తానని హామీనిచ్చారు. రైతు సంఘాల ద్వారా పంటలు పండించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఏటూరు-మొగులూరు కాజ్‌వే నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు చేస్తామన్నారు. సుబాబుల్‌ రైతులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన వారందరినీ గౌరవించి ముందుకు తీసుకొస్తామన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను లాభాల బాట పట్టిస్తున్నామని చెప్పారు. రైల్వే జోన్‌ను సాధించామని, ఎవరికీ ఇబ్బంది లేకుండా పాలన సాగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

 

 

ఇవి కూడా చదవండి: