Google Layoffs: 12 వేల మందికి షాకిచ్చిన గూగుల్.. సుందర్ పిచాయ్ క్షమాపణ
Google Layoffs: భారీగా ఉద్యోగాల కోత పెట్టిన అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, ట్విటర్ బాటలోనే గూగుల్ కూడా చేరింది. గూగుల్ మాతృసంస్ధ ఆల్ఫాబెట్ నుంచి గ్లోబల్ గా 12 వేల ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఉద్యోగుల కోత సందర్భంగా కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ బాధిత ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా తాజా పరిణామాలు, ఖర్చుల నియంత్రణ, ముదురుతున్న ఆర్థిక మాంద్యం తదితర కారణాలతో ఆల్పాబెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
క్షమాపణలు చెప్పిన సుందర్ పిచాయ్
సుమారు 12 వేల మందిని తొలగిస్తున్నామనే బాధాకరమైన నిర్ణయాన్ని వెల్లడించడం కష్టంగా ఉందని సుందర్ పిచాయ్ తెలిపారు.
ఇష్టంతో కష్టపడి పనిచేసే అద్భుతమైన ప్రతిభావంతులకు వీడ్కోలు పలుకుతున్నందుకు చాలా విచారిస్తున్నామని ఉద్యోగులకు పంపిన లేఖలో సుందర్ పేర్కొన్నారు.
గత రెండేళ్లలో వచ్చిన అభివృద్ధితో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాల్సి వచ్చిందని.. కానీ ప్రస్తుతం వాస్తవిక ఆర్థిక పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయన్నారు.
దాని వల్ల ఉద్యోగుల కోత తప్పడం లేదని విచారం వ్యక్తం చేశారు.
సదరు ఉద్యోగులకు సుందర్ పిచాయ్ క్షమాపణలు తెలిపారు. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో వారి కుటుంబాలపై తప్పక ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాలో ఉద్యోగులకు తక్షణమే తొలగింపు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఇతర దేశాల్లో అక్కడి చట్టాలు, విధానాల వల్ల మరికొంత ఆలస్యం అవుతుందని వెల్లడించింది.
కంపెనీ చరిత్ర లో ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగుల కోత ఎప్పుడూ లేదని టెక్ విశ్లేషకులు అంటున్నారు.
గత ఏడాది గూగుల్ కంపెనీ లాభం 27 శాతం తగ్గి 13.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
16 వారాల జీతంతో
కాగా గూగుల్ తొలగించే ఉద్యోగులకు కనీసం 60 రోజుల నోటిఫికేషన్ పీరియడ్ తో పాటు 16 వారాల జీతం, గూగుల్ పనిచేసిన ప్రతి ఏడాదికి 2 వారాల జీతం, 6 నెలల పాటు ఆరోగ్య సంరక్షణ, ఇమిగ్రేషన్ లాంటి విషయాల్లో సహకారం అందించనుంది. ఇది అమెరికాలో పనిచేసిన ఉద్యోగులకు వర్తిస్తుంది.
విప్రో కూడా ఇదే దారిలో
ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో కూడా ఇదే దారిలో నడుస్తోంది. సంస్థలో పనిచేస్తున్న వందల మంది ఫ్రెషర్స్ ను తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది.
పనితీరు పేలవంగా ఉండటంతో వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు సమాచారం.
కంపెనీ ప్రమాణాలకు తగ్గట్లు ప్రతి ఎంట్రీ లెవల్ ఉద్యోగి పనిచేయాల్సి ఉంటుందని.. వారికి కేటాయించిన వర్క్ ప్లేస్ లో మంచి స్కిల్స్ కలిగి ఉండాలని కోరుకుంటామని విప్రో తెలిపింది.
ఈ క్రమంలో బిజినెస్ లక్ష్యాలు, క్లయింట్ అవసరాలు ఉద్యోగుల పనితీరుపై ఆధార పడి ఉంటాయని వెల్లడించింది.
రీట్రైనింగ్ , మానిటరింగ్ వంటి ప్రక్రియల్లో భాగంగా కంపెనీ నుంచి కొంతమంది ఉద్యోగులను విభజించాల్సి ఉంటుందని పేర్కొంది.
దీంతో పనితీరు బాగాలేని ఉద్యోగులను విధుల నుంచ తొలగించాల్సిన అవసరం ఉంటుందని తెలిపింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/