Appalaraju: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. మంత్రి సీదిరి అప్పలరాజు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని వైసీపీ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రకటించారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని వైసీపీ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రకటించారు. పలాస నియోజకవర్గంలో మంత్రి క్యాంప్ ఆఫీస్‌ను ప్రారంభించిన సందర్బంగా నియోజకవర్గ పార్టీ కార్యకర్తలందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేస్తున్నామని మంత్రి అప్పలరాజు చెప్పుకొచ్చారు. అప్పలరాజు మాటలు కార్యకర్తల్లో చర్చనీయాంశమయ్యాయి.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది. కానీ అప్పుడు పార్లమెంట్‌తో పాటు ఎన్నికలు జరుగుతాయి.వాటితో పాటు కాకుండా కొంచెం ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ షెడ్యూల్ కన్నా ఆరు నెలలు ముందే ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. అదేవిధంగా ప్రతిపక్షాలకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే మంత్రి అప్పలరాజు ఈ విధంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కూడా పీకే టీమ్ సర్వే మొదలుపెట్టింది. గడప గడపకు కార్యక్రమం వల్ల ఎమ్మెల్యేల్లో ప్రజల పట్ల ఉన్న స్పందనను తెలుసుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ప్రజల నుంచి నిరసన సెగ ఎదుర్కొన్నారు. వీరందరి జాబితాను పీకే టీమ్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.