Last Updated:

CM Chandrababu: ఏపీలో పారిశ్రామిక నవోదయం.. రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

CM Chandrababu: ఏపీలో పారిశ్రామిక నవోదయం.. రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

CM Chandrababu Holds State Investment Promotion Board Meeting: ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ కూటమి సర్కారు వినియోగించుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు మూడవ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. గత రెండు సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపై సభ్యులతో సీఎం చర్చించారు. అనంతరం.. రూ. 44,776 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులకు సంబందించి పెట్టుబడులను ఈ సమావేశం ఆమోదించింది. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

సీమకు భారీగా పెట్టుబడులు
ఈ సమావేశంలో అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు యాస్పరీ లిమిటెడ్​కు ఆమోదం తెలిపారు. రూ.972 కోట్లతో అనంతపురంలో అనంతపూర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్​కు ఆమోదం లభించింది. రూ.1163 కోట్ల పెట్టుబడితో సత్యసాయి జిల్లాలో కడప రెన్యూవబుల్ లిమిటెడ్ ప్రాజెక్టుకు ఆమోదం ఇచ్చారు. 201 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకోరిన్ సంస్థ ప్రతిపాదనను ఎస్ఐపీబీలో ఆమోదం తెలిపారు. అటు.. కర్నూలు జిల్లాలో రూ.4435 కోట్లతో ఆయానా రెన్యుబుల్ పవర్ లిమిటెడ్​కు ఆమోదం తెలియచేశారు. యాంపిన్ సంస్థ రూ.3142 కోట్లతో ఏర్పాటు చేయనున్న 350 మెగావాట్ల పవన సౌర విద్యుత్ ప్లాంట్​కు ఆమోదం తెలిపారు. రూ.3456 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్ఏఈఎల్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలియచేసింది. రూ.2 వేల కోట్లతో అనంతపురంలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు టాటాపవర్​కు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్నమయ్య జిల్లాలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన సమర్పించింది. రూ.10,300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చేసిన ఈ ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది.

కోస్తా తీరాన కొత్త ప్రాజెక్టులు
ఇక.. మూడు నెలల్లోగా అనకాపల్లిలో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్, రామాయపట్నం వద్ద బీపీసీఎల్ లాంటి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన నిర్వహించేలా ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అల్లూరి జిల్లాలో నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న 2300 మెగావాట్ల ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. రూ.14,328 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదాన్ని తెలియచేశారు. కాకినాడలో ఫెర్టిలైజర్ ప్లాంట్ విస్తరణకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు అనుమతి లభించింది. రూ.1535 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎస్ఐపీబీ ఆమోదించింది. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అలెప్‌కు రూ.305 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు అనుమతి లభించింది. కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం పడింది.

చర్చలు నిరంతర ప్రక్రియ
పెట్టుబడులు త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలా అధికారులు ట్రాకింగ్ చేయాలని సీఎం సూచించారు. దావోస్‌లో ఆసక్తి చూపిన డీపీ వరల్డ్, ఏపీ ముల్లర్ మార్క్స్ వంటి సంస్థలతో సంప్రదింపులు జరపాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గత రెండు సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపైనా ఈ సమావేశంలో చర్చించారు. తమ శాఖలకు చెందిన ఒప్పందాలపై ఆయా మంత్రులు, సదరు శాఖల ఉన్నతాధికారులు పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతర చర్చలు సాగించాలని సూచించారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్ర స్ధాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని ప్రధాన కార్యదర్శికి సీఎం సూచనలు చేశారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థల నుంచి, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుంచి వస్తున్న స్పందన సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి అవకాశాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలని సీఎం పేర్కొన్నారు.