Pawan Kalyan: ఏపీ అభివృద్ధికి కూటమి అంకిత భావంతో ఉంది – దానిని ఎవరు విచ్ఛిన్నం చేయలేరు
AP Deputy CM Pawan Kalyan Comments: చంద్రబాబు, ప్రధాని మోదీ, నేను… 5 కోట్ల మంది ఆంధ్రులకు అండగా ఉండటానికి వచ్చామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురం, కాకినాడ గ్రామీణ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గొల్లప్రోలులో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమిపై వస్తున్న ప్రచారంపై స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి అంకిత భావంతో ఉన్నామని, ఎక్కడా తప్పులు చేయమన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీలో ఎవరైనా కావచ్చు.. ఒకరిద్దరు ఇబ్బందులు పెట్టినా కూటమిని విడదీయలేరని స్పష్టం చేశారు. వ్యక్తిగత గేమ్స్ ఆడోద్దని, మూడు పార్టీల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ విన్నవించుకుంటున్నానన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేరగాళ్ల పట్ల పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నేరగాళ్లపై చర్యలు తీసుకునే ధైర్యం లేనప్పుడు పోలీసులు ఎందుకు? అని మండిపడ్డారు. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నది ఓట్లు అడగడానికేనా అని ఆయన ప్రశ్నించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పుల్లానే.. వారు చేసిన నేరాలు, అధికారుల్లో అలసత్వం కూడా రాష్ట్రానికి వారసత్వంలా వచ్చాయన్నారు. ఇళ్లలోకి వచ్చి రేప్ చేస్తామని కొందరు నాయకులు సోషల్ మీడియాలో అంటుంటే అది భావ ప్రకటన అని వైసీపీ నాయకులు చెబుతున్నారని, ఇలా ప్రోత్సహిస్తే మూడేళ్ల పసికందులను కూడా రేప్ చేయరా అని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై నిలదీస్తే మీరు మన కులపోళ్లని, ప్రాబ్లం అవుతుందంటారు.. అంటే నేరగాళ్లను రోడ్లపై వదిలేయాలా? చర్యలు తీసుకునే ధైర్యం లేనప్పుడు పోలీసులు ఎందుకు? ప్రశ్నించారు.