AP Assembly: 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. తొలిసారిగా పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్
AP Assembly Meetings Starts from 24th of this Month: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6న సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనున్నది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి అనేదానిపై చర్చించనున్నారు. అసెంబ్లీ పనిదినాలు, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను ఖరారు చేయనున్నారు. కనీసం మూడు వారాలకు పైగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
తొలిసారిగా పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నది. ఈ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఎన్నికల హామీలు, ప్రజల ఆశయాలు, అంచనాలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటోంది. పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలతోపాటు ఆయా శాఖల నుంచి వచ్చిన పలు కీలక ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైన సూపర్ సిక్స్ హామీల్లో పెన్షన్లు మినహా మిగిలిన హామీలు అమలు కాలేదు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఎన్నికల్లో చెప్పిన సంక్షేమ పథకాలను ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తారా.. వాటికి ఎంత మేరకు కేటాయింపులు చేస్తారన్న దానిపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పలు కీలక బిల్లులు సిద్ధం..
బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు పలు కీలక బిల్లులను కూడా సిద్ధం చేస్తున్నారు. సమావేశాలకు ముందు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపనున్నారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడు వారాలకు పైగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో బడ్జెట్ సమావేశాలను నాలుగైదు రోజులపాటు నిర్వహించడాన్ని టీడీపీ, బీజేపీలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను వీలైనన్ని ఎక్కువ రోజులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతుంది.
జగన్ హాజరువుతారా?
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బడ్జెట్ సమావేశాలకు హాజరువుతారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయన్నపాత్రుడు సైతం జగన్‌ను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. జగన్ అసెంబ్లీకి వచ్చి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు, బడ్జెట్ కేటాయింపులపై ప్రశ్నించేందుకు సిద్ధపడితే మాత్రం సమావేశాలను హాట్‌హాట్‌గా కొనసాగే అవకాశం ఉంది.
అసెంబ్లీ కమిటీలకు చైర్మన్ల నియామకం
ఏపీ అసెంబ్లీలో పలు కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ ఎన్నికలు జరగగా, ఆయా స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. పీఏసీ చైర్మన్‌గా పులవర్తి రామాంజనేయులు, అంచనాల కమిటీ చైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరరావు, పీయూసీ చైర్మన్‌గా కూన రవికుమార్‌ను నియమిస్తూ అధికారికంగా స్పీకర్ ప్రకటించారు.