India – Sri Lanka Relations: భారత్‌కు షాకిచ్చిన శ్రీలంక.. భారత్‌కు విరుద్ధంగా నిర్ణయాలు..!

Sri Lanka Gives shock to India: భారత్‌కు శ్రీలంక భారీ షాక్‌నిచ్చింది. ఇండియాకు విరుద్ధంగా పలు నిర్ణయాలు తీసుకుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇరుదేశాలు మంచి సత్ససంబంధాలు ఏర్పరుచుకున్నాయి. ఇటీవల ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో ఉన్న శ్రీలంకకు భారత్ సాయం చేసింది. అయితే శ్రీలంక ప్రభుత్వం భారత్ ప్రయోజనాలకు విరుద్ధంగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ధోరణిని కొనసాగిస్తూ.. శ్రీలంక మరోసారి ఇండియాను ఆశ్చర్యపరిచింది. భారత్-శ్రీలంక రక్షణ సంబంధాలకు ఇటీవల ఎదురుదెబ్బ తగులగా, ఈ నేపథ్యంలో భారత్ దక్షిణ పొరుగు దేశం తీసుకున్న నిర్ణయం ఇండియాను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలుస్తోంది. ఇటీవల నిర్ణయంతో శ్రీలంక తన వైమానిక దళ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భారత్ యుద్ధ విమానం తేజస్ ఎంకే1ను కొనుగోలు చేయడానికి నిరాకరించింది.
ఈ నేపథ్యంలో శ్రీలంక తన వైమానిక దళాన్ని అప్‌గ్రేడ్ చేస్తోంది. దీని కోసం భారత్ యుద్ధ విమానం తేజస్ ఎంకే1 ను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. చైనా కూడా జేఎఫ్-17 యుద్ధ విమానాన్ని అందించింది కానీ, శ్రీలంకకు వేరే ప్రణాళికలు ఉన్నాయి. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార్ దిస్సానాయకే నేతృత్వంలోని శ్రీలంక సర్కారు భారత్ లేదా చైనా నుంచి కొత్త జెట్‌లను కొనుగోలు చేయడానికంటే దాని ప్రస్తుత యుద్ధ జెట్ విమానాలను నవీకరించాలని నిర్ణయించింది. శ్రీలంకలో ఇప్పటికే కేఫైయిర్ ఫైటర్ జెట్లు అనే 5 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించుకుంది. అప్ గ్రేడేషన్ ప్రక్రియ కోసం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌తో $49 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది.
భారత్ నిర్ణయాలు, మద్దతును శ్రీలంక ప్రశంసించింది. ప్రధాని మోదీ శ్రీలంకలో పర్యటించినప్పడు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ హిందూ మహాసముద్ర ప్రాంతం కోసం ఇరుదేశాల ఉమ్మడి దృక్పథాన్ని పునరుద్ఘాటించారు. ఇరుదేశాలను ఏకం చేసే చారిత్రక, సాంస్కృతిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసింది. శ్రీలంక సముద్ర సామర్థ్యాలను బలోపేతం చేయడంలో భారత్ తిరుగులేని మద్దతును తాము ఎంతో అభినందిస్తున్నామని శ్రీలంక రక్షణ మంత్రి అరుణ జయశేఖర అన్నారు. 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు సముద్ర భద్రతా సవాళ్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అంతర్జాతీయ నేరాలు, వాతావరణ మార్పు వంటి సంభవిస్తున్న ముప్పులను పరిష్కరించడంలో మన రక్షణ, భద్రతా సహకారాన్ని విస్తరించడం కొనసాగించాలని అరుణ జయశేఖర అన్నారు.