Trinadha Rao Nakkina: ‘మన్మథుడు’ హీరోయిన్ పై డైరెక్టర్ అనుచిత వ్యాఖ్యలు… క్షమాపణలు కోరిన త్రినాథరావు నక్కిన
Director Trinadha Rao Nakkina Apologizes: మన్మథుడు హీరోయిన్ అన్షుపై దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ‘మజాకా’ కార్యక్రమంలో ఆయన హీరోయిన్ అన్షు శరీరాకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. తెలంగాణ మహిళా కమిషన్ దీనికి సుమోటోగా తీసుకుని ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో దర్శకుడు స్పందించాడు.
తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. తన ఎక్స్ లో వీడియో రిలీజ్ చేశాడు. అందరి నమస్కారం. నా పేరు త్రినాథ రావు నక్కిన. నిన్న ‘మజాకా’ టీజర్ లాంచ్ ప్రోగ్రాంలో నేను చేసిన వ్యాఖ్యలు చాలామంది మహిళల మనసును నొప్పించిన విషయం నాకు అర్థమైంది. నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోటి నుంచి వచ్చిన మాటలే తప్ప ఉద్దేశపూర్వకంగా అనలేదు. కావాలని అన్న మాటలు కాదు. అయినా నా వ్యాఖ్యలు మహిళలందరిని మనసు నొప్పించింది కనుక తప్పు తప్పే.
అందరికీ నమస్కారం ముఖ్యంగా మహిళలకి, అన్షు గారికి, మరియు నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను, నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను 🙏🏽 pic.twitter.com/Xfui213GH2
— Trinadharao Nakkina (@TrinadharaoNak1) January 13, 2025
కాబట్టి మనస్ఫూర్తిగా మహిళలందరికి క్షమాపణలు తెలియజేస్తున్నాను. పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని అనుకుంటున్నా.మా ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారు. హీరోయిన్ అన్షు గారికి కూడా క్షమాపణలు తెలియజేస్తున్నాను. అలాగే హీరోయిన్ పేరు మర్చిపోయినట్టుగా చేసింది కూడా సరదాగానే చేశాను. అక్కడ ఉన్నవారిని నవ్వించేందుకే ఇలా చేశాను. కానీ ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని అనుకోనులేదు. అదీ కూడా నేను ఎవరిని బాధపెట్టాలని చేయలేదు. దయచేసి ఈ విషయంలో కూడా ఎవరైన బాధపడి ఉంటే వారందరిని మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా’ అని పేర్కొన్నారు.
కాగా మాజాకా టీజర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు త్రినాథరావు మాట్లాడుతూ.. ‘హీరోయిన్ అన్షును ఉద్దేశిస్తూ ఎప్పుడో మా చిన్నప్పుడు మన్మథుడు సినిమాలో అన్షు గారిని చూశాం. ఆమెను చూసి ఈ హీరోయిన్ ఎంట్రా ఇంత బొద్దుగా ఉంది. ఆమెను చూడటానికి మేం సినిమాకు వెళ్లేవాళ్లం. కానీ చాలా ఏళ్ల తర్వాత ఆమెను చూశాను. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. కానీ ఇప్పుడు సన్నబడ్డారు. తనని చూసి మా ఇలా ఉంటే కుదరదండి మళ్లీ లావు అవ్వాలని చెప్పాను’ అని అన్నాడు. అలాగే ఆమె శరీరాకృతిపై అనుచితంగా మాట్లాడాడు. దీంతో ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మహిళల శరీరాకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దర్శకుడు త్రినాథ రావు నక్కినను వివరణ కోరుతూ తెలంగాణ మహిళా కమిషన్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద అతడికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో నోటీసులు ఇస్తారా లేదా చూడాలి.