Money Saving Tips: డబ్బు ఆదా చేయడానికి ఇవే తెలివైన మార్గాలు.. మీరూ ఫాలో అవ్వండి..!

Smart ways to Save Money: డబ్బు సంపాదించడంతో పాటు, పొదుపు చేయడం కూడా ముఖ్యం. కొంతమంది తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ చాలా ఆదా చేస్తారు. ఇదిలా ఉంటే మరికొంతమంది ఎంత సంపాదించినా ఆదా చేయలేరు. మీరు కూడా డబ్బు ఆదా చేయని వారిలో ఒకరైతే.. చిన్న చిన్న చిట్కాలు అనుసరించడం ద్వారా చాలా డబ్బు ఆదా చేయవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..
అత్యవసరం కోసం..
మీ అల్మారాలో ఒక కవరు ఉంచండి. మీ దగ్గర కొంత డబ్బు మిగిలి ఉన్నప్పుడల్లా.. దానిని ఈ కవరులో వేయండి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో మీరు డబ్బు ఆదా చేయవచ్చు. మీరు ఈ డబ్బును అత్యవసర సమయాల్లో ఉపయోగించవచ్చు. కానీ అత్యవసర పరిస్థితి లేకుండా ఈ డబ్బును ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.
నగదుతో షాపింగ్ చేయడం..
ఈ రోజుల్లో కార్డు స్వైప్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి షాపింగ్ చేస్తున్నప్పుడు మీరు ఎంత ఖర్చు చేస్తున్నారో మీకు తెలియదు. కానీ.. మీతో తీసుకెళ్లిన నగదుతో షాపింగ్ చేస్తే.. ఎంత ఖర్చు చేశారో మీకు తెలుస్తుంది. మీరు కొనాలనుకుంటున్న వస్తువులకు అనుగుణంగా మీతో పాటు నగదు తీసుకెళ్లడానికి ప్రయత్నించండి.
తక్కువ ధరలకు..
ఈ రోజుల్లో ఏదైనా కొనాలంటే..ఒకే వస్తువు రకరకాల స్టోర్లలో అందుబాటులో ఉంటున్నాయి. మీరు మంచి, తక్కువ ధరకే అవసరం అయిప వస్తువులు ఎలా కనుగొనాలో తెలుసుకోండి. ఉదాహరణకు.. ఎప్పుడూ మాల్ లేదా పెద్ద దుకాణంలో షాపింగ్ చేయడానికి బదులుగా.. చిన్న మార్కెట్ లేదా హోల్‌సేల్ మార్కెట్‌లకు వెళ్లండి. ఇక్కడ మీరు తక్కువ ధరకు సరైన ప్రొడక్ట్స్ కొనవచ్చు.
బిల్లులు చెల్లింపు..
చాలా సార్లు మనం కరెంట్, ఫోన్, క్రెడిట్ కార్డ్ బిల్లులను సరైన సమయంలో చెల్లించ లేకపోతుంటాము. గడువు తేదీ ముగిసిన తర్వాత, ఈ బిల్లులపై చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా.. మీ డబ్బు వృధా అవుతుంది. కాబట్టి.. ఏదైనా గడువు తేదీని ఒకే చోట రాసుకుని సమయానికి ముందే చెల్లించండి.
అనవసర ఖర్చులు..
అన్నీ సులభంగా అందుబాటులో ఉండటం వల్ల.. చాలా సార్లు మనకు అవసరం లేని వస్తువులను కొంటుంటాం. తరువాత ఆ వస్తువులు వృధాగా పడి ఉండటం లేదా వాడక పోవడం వంటివి చేస్తుంటాం. ముఖ్యంగా చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌ను ఇష్టపడతారు. ఇలాంటి వారు పెద్దగా అవసరం లేకున్నా ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూ ఉంటారు. మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే దాన్ని మానేయండి. తక్కువ సమయంలో మీరు ఎంత డబ్బు ఆదా చేస్తారో మీరు చూస్తారు.