TDP Mahanadu: కడపలో రేపటి నుంటి టీడీపీ మహానాడు.. పార పట్టిన మంత్రి!
TDP Mahanadu in Kadapa: రేపటి నుంచి జరగనున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి కడప నగరం ముస్తాబైంది. పార్టీ చరిత్రలోనే తొలిసారిగా వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి మూడు రోజులపాటు మహానాడు నిర్వహించనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మహానాడు సభా ప్రాంగణానికి కన్వీనర్ గా ఉన్న నిమ్మల.. వర్షం కారణంగా సభా ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో స్వయంగా రంగంలోకి దిగారు. పార చేతపట్టి మట్టిని తవ్వుతూ.. ప్రాంగణాన్ని చదును చేశారు.
అయితే భారీ వర్షం వచ్చినా మహానాడు నిర్వహణకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. మూడు రోజులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రెంసింగ్ పనులు చేపట్టామని వివరించారు. వచ్చే ఐదురోజులపాటు వర్షాలు పడొచ్చనే హెచ్చరికలతో ముందస్తు చర్యలు చేపట్టారు.
కాగా మహానాడు కార్యక్రమంలో కోసం కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం సమీపంలోని 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహించున్నారు. పార్టీ తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో మహానాడు ప్రాంగణం, కడప, కమలాపురం పసుపుమయమైంది. కాగా సీఎం చంద్రబాబు నేడు కడప చేరుకోనున్నారు. నాలుగు రోజులపాటు మహానాడు ప్రాంగణంలో బస చేయనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను మంత్రి రామానాయుడు ఇప్పటికే పూర్తి చేశారు. నేడు సాయంత్రానికి టీడీపీ మంత్రులు, నేతలు కడపకు చేరుకోనున్నారు.