Published On:

Chandrababu : దేవుని గడపలో తొలి మహానాడు సూపర్‌ హిట్‌ : సీఎం చంద్రబాబు

Chandrababu : దేవుని గడపలో తొలి మహానాడు సూపర్‌ హిట్‌ : సీఎం చంద్రబాబు

AP CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవుని గడపలో తొలి మహానాడు విజయవంతం అయిందని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహానాడు బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కడప.. టీడీపీ అడ్డా అన్నారు. అది నిరూపించేందుకే మహానాడు నిర్వహించామన్నారు.

కార్యకర్తలే నా బలం, బలగం..
అన్నీదారులు కడపవైపే ఉన్నాయని సీఎం అన్నారు. పార్టీ శ్రేణులతో కడప దిగ్బంధమైందన్నారు. కడప గడపలో మార్పు కనిపిస్తోందన్నారు. అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. వైసీపీకి రాయలసీమలో ఏడు సీట్లు వస్తే, కడప జిల్లాలో కూటమి ఏడు గెలిచిందని గుర్తుచేశారు. 2029 ఎన్నికల్లో ఉమ్మడి కడపలో పదికి పది స్థానాలు గెలవాలన్నారు. టీడీపీ కార్యకర్తలే నా బలం, బలగం అన్నారు. మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం, త్యాగం, కష్టం ఉందన్నారు. గత పాలనలో హింసా రాజకీయాలు, కేసులు, అణచివేతలు రాజ్యమేలాయని మండిపడ్డారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు చేసి ప్రజలముందుకొచ్చామన్నారు. 94 శాతం స్ట్రైక్‌ రేట్‌తో అదిరిపోయే విజయం సాధించామన్నారు.

 

రాష్ట్రం పునర్నిర్మాణానికి కృషి..
విధ్వంస రాష్ట్రం పునర్నిర్మాణానికి కష్టపడి పనిచేస్తున్నామన్నారు. వైనాట్‌ గొడ్డలిపోట్లు అనేవి మన విధానం కాదన్నారు. ప్రతిక్షణం కష్టపడి పనిచేయడం మన విధానం అన్నారు. కష్టాలు చూసి బెదిరిపోలేదన్నారు. సవాళ్లు చూసి పారిపోలేదన్నారు. క్లైమోర్‌ మైన్లకే భయపడలేదని, సమస్యలకు భయపడతానా అన్నారు. ఇటుక, ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. పేదప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం తన జీవిత ఆశయమన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అన్నారు. తన కష్టం నా కోసం కాదని, తనను నమ్మిన జనం కోసం అన్నారు. కలిసికట్టుగా ఉంటే వైసీపీ అడ్రస్సే ఉండదని చంద్రబాబు అన్నారు.

 

రాయల సీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తాం..
ప్రజలకు అన్ని సేవలు ఆన్‌లైన్‌లో అందిస్తామని స్పష్టం చేశారు. జూన్‌ 12 నాటికి 500 సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వాట్సప్‌లో హాయ్‌ అని పెడితే పనులు జరుగుతాయన్నారు. 2027 డిసెంబరు నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీనిచ్చారు. దేశానికి ఉగ్రవాదుల వల్ల చాలా నష్టమని, రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టమన్నారు. ఆర్థిక ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తామన్నారు.

 

రాజకీయాల ముసుగులో ల్యాండ్‌, శాండ్‌, మైన్స్‌ దోచేశారని ఆరోపించారు. డ్రగ్స్‌, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరించారు. ఆడబిడ్డల జోలికి వస్తే అవే వారికి అంతిమ గడియలు అన్నారు. గత పాలనలో భూతానికి పరిశ్రమలు వెనకడుగు వేశాయని, భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నామని హామీనిచ్చారు. రాష్ట్రాన్ని గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని మాట ఇచ్చారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. రాయల సీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తామని మాట ఇస్తున్నానని చెప్పారు. రాయలసీమ అభివృద్ధికి బ్లూప్రింట్‌ ఉందని, 6 నెలల్లో కడప హజ్‌హౌస్‌ పూర్తిచేస్తామన్నారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్‌ తప్పకుండా వస్తుందన్నారు. జూన్‌ 12లోగా కడపలో రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ పనులు ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: