Ex Minister Kakani Arrest: అక్రమ మైనింగ్ కేసు.. మాజీ మంత్రి కాకాణి అరెస్ట్
AP Ex Minister Kakani Arrested in Illegal Mining Case: ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి భారీ షాక్ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్దన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పెలుడు పదార్థాల వినియోగం వంటి అంశాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో కాకాణిని ఏ-4 గా చేర్చుతూ.. కేరళలో ఆయనను అరెస్ట్ చేశారు. రాత్రికి నెల్లూరుకి తీసుకువచ్చే అవకాశం ఉంది.
కాగా అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తును ఏపీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాకాణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా కాకాణికి చుక్కెదురైంది. కేసులో ఆయన తరపు న్యాయవాదుల చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో నెల్లూరు పోలీసుల గాలింపుతో కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. 250 కోట్ల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించారని వివాదం చెలరేగింది. గని లీజు కాలం ముగిసినా.. వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అలాగే గనుల్లో పేలుళ్లు జరిపేందుకు పెద్దఎత్తున పేలుడు పదార్థాలు వాడారని వార్తలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 16న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. కాకాణిని ఏ-4గా చేర్చూతూ విచారణకు రావాలని పోలీసులు మూడుసార్లు నోటీసులు జారీ చేశారు. నెల్లూరు, హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నోటీసులు అందించారు. కానీ కాకాణి మాత్రం విచారణకు హాజరకాలేదు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉంటూ వస్తున్న కాకాణి.. తాజాగా కేరళలో నెల్లూరు పోలీసుల చేతికి చిక్కారు.