KTR: తెలంగాణలో ఇందిర ఎమర్జెన్సీ పాలన.. ప్రభుత్వ కుట్రకు పోలీస్ ఉన్నతాధికారుల బలికావొద్దు..కేటీఆర్
KTR Comments On Congress Government: రాష్ట్రంలో సాగుతోంది ఇందిరమ్మ రాజ్యం కాదని, ఇందిర ఎమర్జెన్సీ పాలన అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పట్నం నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు.. కిడ్నాప్ అని ఆరోపించారు. బుధవారం కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. సీఎం తన సొంత అల్లుడు సత్యనారాయణరెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ కోసమే ఫార్మా విలేజ్ అంటూ నాటకాలడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ విధానాలతోనే లగచర్ల ఘటన జరిగిందన్నారు. కొడంగల్ నుంచే ముఖ్యమంత్రి భరతం పడుతామన్నారు. సీఎం అల్లుడు సత్యనారాయణరెడ్డి, శరత్‌ల ఫార్మా కంపెనీలను విస్తరించడం కోసం ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.
సురేష్ అనే వ్యక్తి. బీఆర్ఎస్ నాయకుడే..
తన ఏడెకరాల భూమి కోల్పోతున్న కారణంగానే సురేష్ కలెక్టర్‌ను అడిగాడు. సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ నాయకుడే. నిఘా వ్యవస్థ వైఫల్యంతోనే లగచర్ల ఘటన జరిగిందన్నారు. కలెక్టర్ గన్ మెన్లు ఎక్కడ?. ప్రభుత్వ కుట్రకు పోలీస్ ఉన్నతాధికారుల బలికావద్దని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు సురేష్ పద్ధతిగా మర్యాదగా చెబుతే తప్పా?. సొంత పార్టీ కార్యకర్తలతో మా నేతలు మాట్లాడితే తప్పా?. సురేష్ మమల్ని కలవడం తప్పు అయితే.. రాహుల్ గాంధీ రోజూ తిట్టే అదానీని రేవంత్ కలవడం కూడా తప్పే అన్నారు. హైకోర్టులో పిటిషన్లు వేసి ప్రభుత్వం జడ్జిలను కూడా తప్పుదోవ పట్టిస్తోందన్నారు.
రైతులు జైలుకు వెళ్తుంటే సీఎం ఎక్కడికి పోయిండు..
రేవంత్ పిచ్చి నిర్ణయాలతోనే కొడంగల్ రగులుతున్నదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు మూటలు మోస్తున్నాడని చెప్పారు. రైతుల అక్రమ అరెస్టులు జరుగుతుంటే సీఎం ఎక్కడ అని ప్రశ్నించారు. షోలాపూర్ చౌరస్తాలో నిలబడినా.. రేవంత్‌ను ఎవరూ గుర్తుపట్టారన్నారు. నరేందర్ రెడ్డి భార్యకు కూడా సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. తీవ్రవాదుల మాదిరిగా రైతులను పొలాల వెంబడి తరుముతున్నారని మండిపడ్డారు. ఫార్మా విలేజ్ తో వచ్చే లాభమెంటో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు తిరుపతి రెడ్డికి ఫోన్ చేసి అడిగితే.. తన్ని భూములు తీసుకుంటామని హెచ్చరించలేదా అని అడిగారు.
సీఎం గవర్నర్‌ను కలవడం కూడా తప్పే..
కేంద్ర పెద్దలను నేను కలవడం తప్పు అయితే.. సీఎం గవర్నర్‌ను కలవడం కూడా తప్పే అన్నారు. ఫార్మా సిటీని రద్దు చేస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అనలేదా అని నిలదీశారు. అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు అని.. మళ్లీ యూ టర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెబుతుంటే.. ఐజీ దాడి జరిగిందంటున్నారని కామెంట్స్ చేశారు.