Polavaram Project: పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి ఎత్తిపోతల పథకం.. అభ్యంతరం తెలిపిన తెలంగాణ!
Telangana objects to Polavaram project dead storage: పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఏపీ చేసిన ప్రతిపాదనలపై తెలంగాణ సర్కారు అభ్యంతరం తెలిపింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్‌కుమార్ గోదావరి బోర్డుతోపాటు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాశారు. ఎత్తిపోతల పనులు ఆపినట్లు ఏప్రిల్ 8వ తేదీన జరిగిన పీపీఏలో పోలవరం చీఫ్ ఇంజినీర్ తెలిపారు. అయినా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమైందని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా పోలవరం చేపడుతున్నారని, దీంతో గోదావరి డెల్టా వ్యవస్థ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందని లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోయడం సబబు కాదన్నారు.
నీటి లభ్యత లేదంటూ ఏపీ అభ్యంతరం..
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదంటూ ఏపీ సర్కారు అభ్యంతరం చెబుతోందని, మరోవైపు ఏపీ మాత్రం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి కొత్తగా ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించడం సబబు కాదని అనిల్‌కుమార్ లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి ఎత్తిపోతల చేపట్టడం సీడబ్ల్యూసీ అనుమతులకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.
సీడబ్ల్యూసీ వెంటనే జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్‌ను అడ్డుకోవాలని అనిల్‌కుమార్ కోరారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల చేపట్టకుండా చూడాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు గతంలో కేంద్ర జలసంఘం ఇచ్చిన అనుమతులకు ఇది విరుద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. వెంటనే గోదావరి నదీ యాజమాన్య బోర్డుతోపాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ జోక్యం చేసుకొని పోలవరంపై ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లకుండా నిలువరించాలని కోరారు.