Sandeep Kumar Sultania : రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా
Sandeep Kumar Sultania : రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సందీప్‌కుమార్ సుల్తానియా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం గానీ, లేదా రేపు ఉదయం ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.రామకృష్ణారావు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇటీవల రిటైర్ కాగా, ఆమె స్థానంలో నూతన సీఎస్‌గా కె.రామకృష్ణారావును నియమించారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టులో సందీప్ కుమార్ సుల్తానియాను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
1998 బ్యాచ్‌కు చెందిన సందీప్..
1998 బ్యాచ్‌కు చెందిన సందీప్ కుమార్ సుల్తానియా బిహార్‌కు చెందినవారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా అకౌంటెన్సీ విభాగంలో ఆయన గ్రాడ్యుయేట్ చేశారు. మొదట ఆయన తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం సీఎం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ఆర్థిక, రవాణా, సహకార సంస్థలు, పర్యాటక రంగాల్లో కీలక పదవుల్లో కొనసాగారు. గ్రామీణాభివృద్ధి, భూ రెవెన్యూ నిర్వహణ, పట్టణాభివృద్ధిలో మంచి అనుభవం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు.
డిప్యూటీ సీఎంను కలిసిన సందీప్ కుమార్ సుల్తానియా..
సందీప్ కుమార్ సుల్తానియా ఇవాళ మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ సుల్తానియాకు భట్టి శుభాకాంక్షలు తెలిపారు.