CM Revanth Meets CR Patil: గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌కు అనుమతులివ్వొద్దు.. సీఆర్ పాటిల్‌ను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి!
CM Revanth Reddy Meets Union Water Resources Minister CR Patil: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం ఢిల్లీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. సమావేశంలో ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను సీఎం మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి కేంద్రమంత్రికి వివరించారు. ప్రాజెక్టు తెలంగాణ హక్కులు, గోదావరి నది జలాలపై హక్కులకు భంగం కలిగిస్తుందని తెలిపారు.
ఏపీ సర్కారు చేపట్టిన గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన పథకంలో భాగంగా పోలవరం నుంచి 200-400 టీఎంసీ నీటిని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించే లక్ష్యంతో ఉన్నారని మంత్రి వివరించిననట్లుగా తెలుస్తోంది. గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్‌కు ఏకపక్షంగా మళ్లించడం వల్ల తెలంగాణకు నీటి లభ్యత తగ్గుతుందని తెలిపారు. దీంతో తెలంగాణలోని వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. భద్రాచలం, మణుగూరు వంటి ప్రాంతాల్లో ముంపు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విన్నవించారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో ఏపీ ప్రభుత్వం గోదావరి నది జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డు 1980తో పాటు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి పంపారని, దీంతో పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని రేవంత్‌రెడ్డి బృందం సీఆర్ పాటిల్‌ను కోరినట్లుగా సమాచారం.
సీఆర్ పాటిల్ హామీ..
భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలను సీఆర్ పాటిల్‌కు వివరించినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిగా ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమన్నారు. కేంద్ర మంత్రి కూడా తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఇంకా పూర్తి డీపీఆర్ రాలేదని చెప్పారని తెలిపారు. తమకు కృష్ణా, గోదావరి జలాల్లో 1500 టీఎంసీలకు ఎన్‌వోసీ ఇస్తేనే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం లేదని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. ఏపీ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు వస్తున్నాయని, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం చేయబోమని సీఆర్ పాటిల్ హామీనిచ్చారని మంత్రి ఉత్తమ్ తెలిపారు.