Telangana: జులై 1 నుంచి సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల సమ్మె

Doctors Strike: తెలంగాణలో జులై 1 నుంచి సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు సమ్మె చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇవాళ ప్రకటన చేసింది. ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని రకాల సేవల నుంచి వైదొలుగుతామని సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు హెచ్చరించారు. తమ డిమాండ్స్ నెరవేరిన తర్వాతనే సమ్మెను విరమిస్తామని స్పష్టం చేశారు. పెండింగ్ స్టైఫండ్ అంశాలతోపాటు, స్టైఫండ్ పెంపు అంశాలపై ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు మూడు నెలలుగా స్టైఫండ్ చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న స్టైఫండ్ పెంపు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, అదేవిధంగా రెసిడెంట్ ఉద్యోగ కాలాన్ని కొనసాగించేందుకు ఎక్స్ టెన్షన్ జీఓ ఇంకా విడుదల చేయలేదని చెప్పారు.