Kavitha Meeting with Jagruti Sreni: జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత భేటీ.. పార్టీ మార్పుపై చర్చ?
Kavitha meets with Singareni area Jagruti Sreseni: బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రికి రాసిన లేఖ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఉత్కంఠ నెలకొనగా, ఇవాళ ఉదయం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో సింగరేణి ఏరియా జాగృతి శ్రేణులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ, పార్టీపై వ్యాఖ్యల తర్వాత జరిగిన కవిత భేటీకి ప్రాధాన్యత సంచరించుకుంది. ఏయే అంశాలపై మాట్లాడబోతున్నారు? ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? అనేది ఉత్కంఠగా మారింది.
కవిత తన దారి తాను వెతుక్కోబోతున్నారా..?
ఎమ్మెల్సీ కవిత లేఖ ప్రత్యర్థులకు అస్త్రంగా మారబోతుందని గ్రహించిన కేసీఆర్ రంగంలోకి దిగారు. తన సన్నిహితులు ఎంపీ దీవకొండ దామోదరరావు, న్యాయవాది గండ్ర మోహన్‌రావు ద్వారా తన సమాచారాన్ని కవితకు చేరవేసినట్లు తెలుస్తోంది. కవిత కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్ తొందరపడొద్దని కూతురుకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. బుజ్జగింపుల పర్వం జరిగిన మరుసటి రోజు ఆమె జాగృతి నేతలతో భేటీ కావడం ఆసక్తిగా మారింది. రాజకీయ భవిష్యత్‌కు సంబంధించి సమావేశంలో తన అనుచరుల అభిప్రాయాలను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం జరుగుతున్న వేళ కేసీఆర్ రాయబారం పని చేసిందా? లేక కవిత తన దారి తాను వెతుక్కోబోతున్నారా? అనేది తేలాల్సి ఉంది.