Published On:

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్​.. పెరగనున్న ఛార్జీలు!

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్​.. పెరగనున్న ఛార్జీలు!

Hyderabad Metro Rail Ticket charges Hike: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో బిగ్ షాక్ తగలనుంది. త్వరలో మెట్రో ఛార్జీలు పెంచనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా హైదరాబాద్ మెట్రో నష్టాల్లో ఉంది. ఈ నష్టాలను భర్తీ చేసేందుకు మెట్రో ఛార్జీలు పెంచాలని ఎల్ అండ్ టీ నిర్ణయం తీసుకుంది.

 

కరోనా తర్వాత నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న మెట్రోను లాభాలు తీసుకొచ్చేందుకు గతంలోనే ఛార్జీలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఛార్జీల పెంపు విషయమై అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ మేరకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో మెట్రో ఛార్జీల పెంపు విషయం అమలు కాలేదు.

 

తాజాగా, మరోసారి మెట్రో ఛార్జీల పెంపు విషయం వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా ఛార్జీలు పెంచాలనే ఆలోచనను మళ్లీ ముందుకు తీసుకొచ్చింది. హైదరాబాద్ మెట్రోలో ఉన్న నష్టాలను తగ్గించుకునేందుకు సంస్థ భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

 

ఇందులో భాగంగానే ప్రస్తుతం మెట్రోలో ఒక్క టికెట్‌పై కనిష్ట ధర రూ.10 ఉండగా.. గరిష్ట ధర రూ. 60గా ఉంది. ఈ మేరకు గరిష్ట ధరను రూ.75కు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఒక వేళ ఛార్జీలు పెరిగితే ఏడాదికి అదనంగా రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని హైదరాబాద్ మెట్రోను నడిపిస్తున్న ఎల్ అంట్ టీ సంస్థ భావిస్తోంది. కాగా, పెరగనున్న ఛార్జీలు మే 2వ వారం నుంచి అందుబాటులోకి వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి.