UITP Awards: హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు అంతర్జాతీయ పురస్కారం

Hyderabad Metro Rail: జర్మనీలోని హాంబర్గ్‌లో ఇటీవల జరిగిన యూఐటీపీ-2025 అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో ఆసియా పసిఫిక్ ప్రాంతానికి (హైదరాబాడ్) ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు లిమిటెడ్‌కు ప్రత్యేక గుర్తింపు పురస్కారం దక్కించుకుంది. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ తోడ్పాటుతో ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్ఎల్ ‘ఆప్టిమైజ్డ్ మెట్రో ఆపరేషన్ ప్లాన్స్ లీడింగ్ టు ఇన్‌క్రీజ్డ్ రెవెన్యూ పర్ ట్రెయిన్’ప్రాజెక్టుకు తాజాగా పురస్కారం లభించింది.
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నిర్వహించే పురస్కారాల ప్రోగ్రామ్ అర్బన్ మొబిలిటీని తీర్చిదిద్దుతున్న పరివర్తనాత్మకమైన ప్రాజెక్టులకు విశిష్ట గుర్తింపునిస్తోంది. గ్లోబల్ నెట్‌వర్క్ యూఐటీపీలో దాదాపు 100 దేశాల నుంచి వివిధ ప్రజారవాణా మాధ్యమాలకు చెందిన 1,900 ఆర్గనైజేషన్లకు సభ్యత్వం పొందాయి. 2025 ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి ట్రాన్సిట్ ఆపరేటర్ల నుంచి 500 పైగా ఎంట్రీలు వచ్చాయి. ఆపరేషనల్ ఎక్సలెన్స్ కేటగిరీలో హైదరాబాద్ మెట్రో సమర్పించిన ఎంట్రీకి టాప్ 5 ఫైనల్ జాబితా షార్ట్‌లిస్టులో చోటు దక్కింది. డేటా, సమర్ధత ఆధారిత విధానాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. యూఐటీపీ నుంచి ప్రతిష్టాత్మక పురస్కారం పొందడం తమకెంతో గర్వకారణమని తెలిపారు. సమర్ధత, ప్రయాణికులకు ఉపయుక్తమైన సొల్యూషన్స్‌పై మాకున్న నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య మెట్రో ప్రాజెక్టు ఆపరేటరుగా, నిర్వహణ సామర్థ్యాలు, పురోగామి వ్యూహాలతో హైదరాబాద్ మెట్రోను ప్రపంచ వేదికపై నిలబెట్టడంపై తామెంతో గర్విస్తున్నామని పేర్కొన్నారు. నిర్దిష్ట లక్ష్యాల సాధనకు అనుగుణంగా స్మార్టు రవాణా ప్రణాళికలను అమలు చేయడమనేది ఇటు వ్యవస్థపై అటు కార్యకలాపాలు నిర్వహిస్తున్న నగరంపై అర్థవంతమైన ప్రభావం చూపగలదనే తమ నమ్మకాన్ని అవార్డు పునరుద్ఘాటిస్తుందని వెల్లడించారు.