CM Revanth Reddy: సింగూర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా మారుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి!
CM Revanth Reddy visit to Zaheerabad: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించారు. హుగ్గెల్లి కూడలిలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాచునూరులో కేంద్రీయ విద్యాలయం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పస్తాపూర్ చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలో రూ.494.67 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అక్కడ మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. మెదక్ జిల్లా అంటే ఇందిరమ్మ.. ఇందిరమ్మ అంటే మెదక్ జిల్లా అని, మెదక్ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. జహీరాబాద్ నిమ్జ్ కోసం భూములు కోల్పోయిన 5,612 మంది కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం హామీనిచ్చారు. సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం కింద తీర్చిదిద్దుతామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వరుల స్ఫూర్తితో పాలన సాగిస్తున్నదని సీఎం తెలిపారు. బసవేశ్వరుడి చూపిన మార్గం తెలంగాణ ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉందని వ్యాఖ్యానించారు. వారి సిద్ధాంతాలను అనుసరిస్తూ సామాజిక న్యాయం, సమానత్వంపై దృష్టి సారిస్తున్నామన్నారు.
రాహుల్ గాంధీ చేసిన 150 రోజుల పాదయాత్రను గుర్తుచేశారు. యాత్రలో భాగంగా కాంగ్రెస్ జనగణనతోపాటు కులగణన నిర్వహించాలని ప్రకటించిందని పేర్కొన్నారు. ఇది బసవేశ్వరుడి సిద్ధాంతాలనే ప్రతిబింబిస్తుందన్నారు. బసవేశ్వరుడి సందేశం అనుసరించి, ప్రతి వర్గానికి సముచిత భాగస్వామ్యం కల్పించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యానికి బసవేశ్వరుడి సందేశం మానవతా విలువలపై ఆధారపడి ఉన్న సూచికగా సీఎం అభివర్ణించారు.