CM Revanth Reddy: విద్యాశాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

CM Revanth Reddy Review Education Department: తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ బడులను సందర్శించాలని సూచించారు. బుధవారం కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సంవత్పరం ప్రైవేట్ పాఠశాలల నుంచి 48 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు మౌలిక వసతులను పాఠశాలల్లో కల్పించాలన్నారు. పాఠశాలల్లో గ్యాస్, కట్టెల పొయ్యిల బాధ లేకుండా మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు సోలార్ కిచెన్లు ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. పదో తరగతిలో ఉత్తీర్ణులు అవుతున్న విద్యార్థులకు, ఇంటర్‌లో చేరుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య తేడా ఎందుకు ఎక్కువగా ఉందని అధికారులను ప్రశ్నించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్‌లో చేరేలా చూడాలన్నారు. ఇంటర్ తర్వాత జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ పొందొచ్చని, తద్వారా వారి జీవితానికి ఢోకా ఉండదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
సీఎం రేవంత్‌కి టోనీ బ్లెయిర్ లేఖ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ లేఖ రాశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్-2047ను ప్రశంసించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా టోనీ బ్లెయిర్‌తో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 గురించి ఆయనకు వివరించారు. పెట్టుబడులు, ఐటీ, ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో లక్ష్యాల గురించి చర్చించారు. ఈ నేపథ్యంలో టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్, తెలంగాణ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రైజింగ్ విజన్ రూపకల్పన, అమలుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను ఇరువైపుల ప్రతినిధులు మార్చుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 తనను ఆకట్టుకుందంటూ ముఖ్యమంత్రిని టోనీ బ్లెయిర్ అభినందించారు. విజన్‌కు సహకరిస్తామని తెలిపారు.