Union Minister Kishan reddy: కేంద్రాన్ని కేసిఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. కిషన్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో తెలంగాణాలో రాజకీయ వార్ రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రధానంగా టీఆర్ఎస్, భాజాపా నేతల మద్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఓ వైపు కేంద్రం పై కేసిఆర్ కాలుదువ్వుతుంటే, మరో వైపు భాజపా కేసిఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad: మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో తెలంగాణాలో రాజకీయ వార్ రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రధానంగా టీఆర్ఎస్, భాజాపా నేతల మద్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఓ వైపు కేంద్రం పై కేసిఆర్ కాలుదువ్వుతుంటే, మరో వైపు భాజపా కేసిఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసిఆర్ పై విమర్శలు గుప్పించారు.
జాతీయ పార్టీ పేరుతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పలు రాష్ట్రాల్లోని ప్రతి పక్ష నేతలకు దగ్గరకు వెళ్లిన ప్రతిసారి, అవమానంతో కేసిఆర్ తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. నయవంచన పాలనతో తెలంగాణ ప్రజలను కేసిఆర్ మోసం చేస్తున్నారని అన్నారు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోతగా ప్రచారం చేసుకొంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ పూర్తిగా దిగజారిందన్న కిషన్ రెడ్డి, తెలంగాణ అప్పులు 5లక్షల కోట్లకు చేరుకొన్నాయని చెప్పారు. ఇంకా అప్పులు కావాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ఎంతవరకు సబబని అని ప్రశ్నించారు.
ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఆసరా ఫింక్ఛన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సబ్సిడీ రుణాలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు స్కాలర్ షిప్పులు, వ్యవసాయ రంగానికి చెందిన ప్రోత్సహాకాలు, పొదుపు సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, చివరకు జీహెచ్ఎంసీ లో చిన్న పాటి కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్ధితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం శోచనీయన్నారు. ధర్నాలు, పోరాటాలతో నగదును తీసుకోవాల్సిన పరిస్ధితి కాంట్రాక్టర్లకు ఏర్పడిందన్నారు. రాష్ట్రానికి 80శాతం రెవిన్యూ భాగ్యనగరాల ద్వారానే వస్తుందని ఈ సందర్భంగా గుర్తుచేసారు.
కేంద్రానికి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్ర పాలన సరిగా చేయండి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసిఆర్ కు హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను తప్పించుకొనేందుకు ప్రధాని మోదీని, కేంద్రాన్ని తప్పు పట్టడం సరికాదన్నారు. గ్రామ పంచాయితీల అభివృద్ధికి ఎంతమేర నిధులు రాష్ట్రం నుండి మంజూరు చేసారో చెప్పే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. అదే క్రమంలో కేంద్రం నుండి ఏ మేరకు నిధులు మంజూరు అయ్యేయో చెప్పే సత్తా ఉందా అంటూ కేసిఆర్ పై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్, రోడ్లు, పారిశుద్ధ్యంకు ఖర్చు చేసే నిధులు కేంద్రం నుండి కాని, మలేరియా నిధులు నుండి రాష్ట్రం ఖర్చు చేస్తుందని తెలియచేశారు. పనులు చేపట్టిన సర్పంచ్ లు, ఎంపీటీసిలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని, దీనికి బాధ్యులు టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకాని పాలనకు నిదర్శనంగా తెలిపారు. రైతు రుణ మాఫీ నేటికి పూర్తి కాకపోవడం పై సమాధానం చెప్పాలన్నారు.
ధరణి పోర్టల్ తో కొండను తవ్వి ఎలుకను పట్టిన్నట్లుగా అయిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పొరుగు దేశాల్లోనో, పొరుగు ప్రాంతాల్లో ఉన్న వారి భూములను ధరణి పేరుతో టీఆర్ఎస్ నేతలు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు 4 లక్షల మంది ధరణి పోర్టల్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దరఖాస్తులు పెట్టుకొన్న మాట వాస్తవం కాదా అని అడిగారు. మరో వైపు ప్రభుత్వ భూములు, చెరువులు, గుంటలు, అసైన్డ్ భూములు ఆక్రమణలకు గురౌతున్నాయని, పార్కులు, చివరకు కేంద్ర భమూలను సైతం కబ్జా చేస్తున్న టీఆర్ఎస్ నేతలు తీరును తప్పుబట్టారు. మూడు సంవత్సరాల క్రితం పేర్కొన్న నిరుద్యోగ బృతి రూ. 3116 ఎక్కడ కేసిఆర్ ఎప్పుడు ఇస్తారు అంటూ కిషన్ రెడ్డి అడిగారు.
ఇది కూడా చదవండి: రాంకో సిమెంటు కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరు మృతి