Published On:

CM MK Stalin : కేంద్రంపై స్టాలిన్ ‘డీలిమిటేషన్’ యుద్ధం.. 7 రాష్ట్రాల సీఎంలకు లేఖ

CM MK Stalin : కేంద్రంపై స్టాలిన్ ‘డీలిమిటేషన్’ యుద్ధం.. 7 రాష్ట్రాల సీఎంలకు లేఖ

CM MK Stalin : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రంపై యుద్ధం ప్రారంభించారు. ఇదే విషయంపై తాజాగా ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ కసరత్తుకు వ్యతిరేకంగా జేఏసీని ఏర్పాటు చేద్దామని సీఎం పిలుపునిచ్చారు. ఇటీవల తమిళనాడులో సీఎం స్టాలిన్‌ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, తీర్మానం చేశారు. తీర్మానం ఆధారంగా లేఖలు రాశారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సాకు సీఎంలకు పంపారు.

ఈ నెల 22న చెన్నైలో సమావేశం..
ఈ నెల 22న చెన్నైలో సమావేశం నిర్వహిస్తున్నట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. సమావేశానికి అందరూ హాజరుకావాలని కోరారు. ఏడు రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు, అధికార, ప్రతిపక్ష నాయకులను ఆహ్వానించారు. డీలిమిటేషన్ అనేది సమాఖ్యవాదంపై చేస్తోన్న దాడి అన్నారు. ఇది పార్లమెంట్‌లో మన హక్కులకు కోత పెట్టి, జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించడమే అవుతుందన్నారు. అన్యాయాన్ని తాము సహించబోమని స్టాలిన్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఏమిటీ డీలిమిటేషన్ వివాదం..?
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరుగనున్నది. ఇందుకు అనుసరించే విధివిధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన మొదలైంది. జనాభా తక్కువగా ఉండడంతో లోక్‌సభలో ప్రాతినిధ్యానికి కోత పడుతుందన్న భయాలు ఉన్నాయి. కుటుంబ నియంత్రణ పాటించటంలో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయమే వాటి పాలిట శాపం కానుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జనాభా నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అధిక జనాభా కలిగిన యూపీ, బిహార్‌ లోక్‌సభలో తమ సీట్ల సంఖ్యను ఇప్పటికన్నా పెంచుకోనున్నాయి.

ఫలితంగా కేంద్రం నుంచి తమకు రావాల్సిన నిధుల కోసం డిమాండ్‌ చేసే సత్తా దక్షిణాది రాష్ట్రాలకు తగ్గిపోతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర-దక్షిణ విభేదాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెచ్చరిల్లే ప్రమాదం ఉంది. తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావన దక్షిణ భారత రాష్ట్రాల్లో వ్యాపిస్తోంది.

అందుకే జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను తమిళనాడు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఈ అంశంలో కేంద్రంతో పోరాడుతోంది. పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచే పక్షంలో 1971 జనాభా లెక్కల ఆధారంగా ఇరుసభల్లో రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న నిష్పత్తి మేరకు నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి అవసరమైన రాజ్యాంగ సవరణలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది.

ఇవి కూడా చదవండి: