Maharashtra: మహాపీఠంపై ముగిసిన చర్చ.. నేడు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం
Maharashtra CM to be announced after BJP’s key meet today: మహా పీఠంపై వారం రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి మంగళవారం తెరపడింది. మంగళవారం నాటి ఫడ్నవీస్, షిండే భేటీతో మరో రెండు రోజుల్లో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంలుగా పాత నేతలే కొనసాగనున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. బుధవారం నాడు నిర్వహించే బీజేపీ శాసన సభా పక్ష సమావేశంలో ఫడ్నవీస్‌ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. రేపు ముంబైలో నూతన సర్కారు కొలువుదీరనుంది.
షిండేకు హోం దక్కేనా?
కొత్త ప్రభుత్వంలో గతంలో మాదిరిగా షిండే, అజిత్ పవార్‌లు ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగనున్నారని, వారికి గౌరవ ప్రదమైన సంఖ్యలో మంత్రి పదవులు కేటాయించనున్నారని తెలుస్తోంది. అయితే, గత నాలుగు రోజులుగా తనకే హోం శాఖ కేటాయించాలని బెట్టు చేస్తున్న షిండే ఈ విషయంలో ఒక మెట్టు దిగినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన కోరికను గౌరవిస్తూ హోం శాఖ బాధ్యతలను ఆయనకే కేటాయిస్తారా? లేక డిప్యూటీ సీఎంగా చేసి సరిపెడతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. హోం మంత్రిత్వ శాఖ లేకుండా డిప్యూటీ పదవిని స్వీకరించడంపై షిండే సుముఖత చూపడం లేదంటూ మరోవైపు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
కలిసి సాగుదాం..
ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోవటంతో మంగళవారం దేవేంద్ర ఫడ్నవీస్.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి షిండేను సతారాలో కలిశారు. కలిసి సాగాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నారని, ఈ సమావేశంలో మంత్రి పదవుల ప్రస్తావన మీద కూడా ఏకాభిప్రాయం వ్యక్తమైందని తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ఏక్‌నాథ్ షిండే ముంబైకి బయలుదేరటంతో కథ సుఖాంతమైందని అందరూ భావిస్తున్నారు.
మెరుగుపడని షిండే ఆరోగ్యం..
మరోవైపు ఏక్‌నాథ్ శిండే కొన్ని రోజులుగా జ్వరం, గొంతునొప్పితో ఇబ్బందిపడుతున్నారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మంగళవారం ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు శిండే సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఠాణెలోని ఓ ఆసుపత్రిలో ఆయన చెకప్ చేయించుకున్నారు. ఆయనకు పలు వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించినట్లు సదరు వర్గాలు తెలిపాయి.