Kharge: కొందరు నేతలకు పార్టీ కంటే ప్రధాని మోదీనే ప్రాధాన్యం..శశిథరూర్‌పై ఖర్గే కీలక వ్యాఖ్యలు

Kharge comments on Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ మోదీ ప్రభుత్వానికి అనుకూల వ్యాఖ్యలు చేస్తూ సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పరోక్షంగా థరూర్‌కు చురకలు అంటించారు. ఓ కార్యక్రమంలో ఖర్గే పాల్లొని మాట్లాడారు. తమకు దేశమే మొదటి ప్రాధాన్యమని తర్వాత పార్టీ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో బాధితుల వైపు కాంగ్రెస్ పార్టీ నిలబడిందన్నారు. కానీ, కొందరు నేతలకు మాత్రం పార్టీ కంటే ప్రధాని మోదీనే ప్రాధాన్యమని మండిపడ్డారు.
శశిథరూర్‌కు ఆంగ్ల భాషపై మంచిపట్టు ఉందని ఖర్గే ప్రశంసించారు. తనకు ఇంగ్లిష్ చదవడం రానందున థరూర్‌ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిని చేశామన్నారు. కొందరు నేతలు పార్టీ పద్ధతులను మరిచి చేసే పనులు, వ్యాఖ్యలను మనం ఏమి చేయగలమని ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలపై థరూర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆకాశం ఎవరికీ చెందదు అని, రెక్కలు మీవి ఎగరడానికి ఎవరినీ అనుమతి అడగొద్దని రాసుకొచ్చారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం మోదీని ప్రశంసిస్తూ శశిథరూర్ ఓ ఆంగ్ల పత్రికలో వ్యాసం రాశారు. శశిథరూర్ రాసిన వ్యాసాన్ని ప్రధాని కార్యాలయం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దేశం ఒంటరిగా ఉందంటూ మోదీ సర్కారు విదేశాంగ విధానంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్ తర్వాత దౌత్యపరమైన కృషి జరిగింది. జాతీయ సంకల్పం, ప్రభావవంతమైన వ్యక్తీకరణకు రుజువుగా పేర్కొన్నారు. విదేశాంగ విధానానికి కీలక ఘట్టాన్ని అందించిందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో అతడి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు.