Dera Sacha Sauda Chief: హత్య కేసులో డేరాబాబాను నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ రాంరహీం సింగ్‌కు పంజాబ్, హర్యానా హైకోర్టులో మంగళవారం భారీ ఊరట లభించింది. డేరా మేనేజర్ రంజీత్‌సింగ్ హత్యలో కోర్టు డేరా చీఫ్‌తో పాటు మరో నలుగురిని నిర్దోషులుగా తీర్పు వెలువరించింది.
Dera Sacha Sauda Chief: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ రాంరహీం సింగ్‌కు పంజాబ్, హర్యానా హైకోర్టులో మంగళవారం భారీ ఊరట లభించింది. డేరా మేనేజర్ రంజీత్‌సింగ్ హత్యలో కోర్టు డేరా చీఫ్‌తో పాటు మరో నలుగురిని నిర్దోషులుగా తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని డేరా చీఫ్ అడ్వకేట్ జాతిందర్ ఖరానా చెప్పారు. ఇక కేసు పూర్వాపరాల విషయానికి వస్తే రంజిత్‌సింగ్ కురుక్షేత్రలోని కాన్పూర్ కొలాన్ గ్రామంలో జూలై 2002లో తన పొలంలో పని చేసుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే డేరా చీఫ్ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాడంటూ ఒక లేఖ ప్రచారంలోకి తెచ్చాడు రంజిత్ సింగ్. ఈ హత్య తర్వాత సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది.
పలు కేసుల్లో డేరా బాబా.. (Dera Sacha Sauda Chief)
ఇదిలా ఉండగా అక్టోబర్ 2021లో ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ కేసుకు సంబంధించి డేరా చీఫ్ రామ్ రహీమ్‌తో పాటు మరో నలుగురికి జీవిత ఖైదు విధించింది. ఇక రామ్ రహీమ్ ప్రధాన కుట్రదారుడిగా కోర్టులో కేసు ఫైల్ అయ్యింది. తనకు తాను దేవుడిగా ప్రకటించుకున్న డేరా చీఫ్ తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన రొహతక్‌లోని సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక మరో కేసులో 16 ఏళ్ల క్రితం ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో ఆయనకు శిక్ష పడింది.
కాగా డేరా చీఫ్‌కు అత్యాచారం కేసులో శిక్షపడిందని తెలియగానే ఆగస్టు 2017 లో ఆయన శిష్యులు హర్యానాలో పలు ప్రాంతాల్లో పెను విధ్వంసం సృష్టించారు. ఈ విధ్వంసంలో కనీసం 41 మంది మృతి చెందగా…. పలువురు గాయపడ్డారు. ఇక రామ్ రహీమ్‌పై అత్యాచారం ఆరోపణల విషయానికి వస్తే ఏప్రిల్ 2002లో ఓ అజ్ఞాత వ్యక్తి నేరుగా అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయికి, పంజాబ్, హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. అదే సంవత్సరం మేలో హైకోర్టు సిర్సా జిల్లా జడ్జిని డేరా చీఫ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని ఆదేశించింది. అయితే సెప్టెంబర్ 2022లో ఈ కేసును సీబీఐకి బదిలీ చేసి దర్యాప్తు మొదలుపెట్టమని కోరింది.
ఇదిలా ఉండగా డేరా చీఫ్ రామ్ రహీం ఇప్పటికే పలు వివాదాస్పద కేసులో శిక్షలు కూడా పడ్డాయి. ఇప్పటికే ఆయన అత్యాచారం కేసులో పలుమార్లు పెరోల్‌పై బయటికి వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్ .. హర్యానా హైకోర్టు.. రాష్ర్టప్రభుత్వానికి తమ అనమతి లేకుండా పెరోల్ ఇవ్వరాదని కోరింది. ఈ ఏడాది జనవరి 19న డేరా చీఫ్ కు 50 రోజుల పెరోల్ లభించింది. గతేడాది నవంబర్‌లో 21 రోజుల పెరోల్ లభించింది. అంతకు ముందు జనవరి 2023లో 40 రోజులు పెరోల్ లభించింది. కాగా అక్టోబర్‌లో 40 రోజుల పెరోల్ లభించింది.