Last Updated:

Vangaveeti Mohana Ranga: రంగా హత్య ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే.. CBI కేసు ప్రధాన సాక్షి గాళ్ల సుబ్రహ్మణ్యం

దివంగత వంగవీటి రంగా హత్య అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసిన హత్యని రంగా అనుచరుడు గాళ్ల సుబ్రహ్మణ్యం తెలిపారు.

Vangaveeti Mohana Ranga: రంగా హత్య ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే.. CBI కేసు ప్రధాన సాక్షి గాళ్ల సుబ్రహ్మణ్యం

Vangaveeti Mohana Ranga : దివంగత వంగవీటి రంగా హత్య అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసిన హత్యని రంగా హత్య కేసులోను, సీబీఐ విచారణలోను ప్రధాన సాక్షిగా ఉన్న గాళ్ల సుబ్రహ్మణ్యం తెలిపారు. తమ అధికారం పోతుందని చేసిన హత్య. ఈ కేసుకు దేవినేని నెహ్రూకు సంబంధం లేదు. ఇది ప్రభుత్వం చేసిన హత్య. అధికారంలో ఉన్న వర్గం, అధికారంలోకి రావాలనుకున్న వర్గం చేసినదని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడకు చెందిన సుబ్రహ్మణ్యం 1974 నుంచి రంగా వెంట ఉన్నారు. రంగా హత్య, అనంతర పరిణామాలపై ఆయన ప్రైమ్ 9 న్యూస్ తో మాట్లాడారు. రంగా అంత్యక్రియలు సాయంత్రం ఆరుగంటల్లోపు చేయాలన్నారు. రంగా అనుచరులను 35 మందిని దేవినేని మురళి హత్యకేసులో చేర్చారు. తెరవెనుక చాలా ప్రయత్నాలు జరిగాయి. ప్రధాన ముద్దాయిలు తప్పించుకున్నారు. రంగా హత్యకేసును నీరు గార్చారు. డిసెంబర్ 22 రంగా నిరాహారదీక్షకు దిగినరోజు. ఆరోజు విజయవాడ క్రీస్తురాజపురంలో పేదల ఇళ్లపట్టాలకు సంబంధించిన సమస్యగురించి చర్చించేందుకు రంగా అనుచరులతో కలసివెడుతుండగా అప్పటి ఏసీపీ అడ్డుకున్నారు. అక్కడనుంచి ముందుకువెళ్లడానికి వీల్లేదని మంత్రి కోడెల శివరామప్రసాద్ ఉన్నందున ఆగిపోవాలని చెప్పారు. దీనికి రంగా అంగీకరించలేదు. ఏసీపీతో, కోడెల శివప్రసాద్ తో వాగ్వాదం జరిగింది. ఈ సందర్బంగా కోడెల నీ సంగతి చూస్తాను అన్నట్లుగా వ్యాఖ్యానించారు. అలా అన్న నాలుగురోజులకే రంగా హత్యకు గురయ్యారని సుబ్రహ్మణ్యం తెలిపారు.

రంగా హత్య తరువాత ఆయన వర్గానికి చెందిన నేతలు చాల బాధలు పడ్డారు. వారికి సరైన ఆదరణ లభించలేదు. ఒక్క మల్లాది విష్ణు మాత్రమే ఎమ్మెల్యే అయ్యాడు. తరువాత రంగా భార్య వంగవీటి రత్నకుమారి ఎమ్మెల్యే అయ్యారు. రంగా సోదరుడు చలపతిరావు కూడ ఎమ్మెల్యే అయ్యారు. వీరిద్దరి మధ్య కాంగ్రెస్ పార్టీ విబేధాలను సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ ఎవరినీ ఎదగనీయదు. రంగా ఒక్క కులానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదు. కానీ ఆయనను కాపుకులానికి సంబంధించిన నాయకుడిగా ముద్రవేసారు. చిరంజీవి ప్రజారాజ్యం స్దాపించినపుడు కూడా ఇదే ముద్ర వేసారు. రంగా మొదటిసారి ఇండిపెండెంట్ గా పోటీచేసి కార్పోరేటర్ గా గెలిచారు. తరువాత కాంగ్రెస్ పార్టీ ఆయనను గుర్తించింది. దీనితో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అయ్యారు. తనకు ఉన్న నెట్ వర్క్ తో ఎప్పడూ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసారు. వరదలు వచ్చినపుడు, సామాన్యులు రౌడీల బారిన పడినా, దొంగతనాలు జరిగినా తనదైన శైలిలో వాటికి కారకులు ఎవరో గుర్తించి బాధితులకు న్యాయం చేసేవారు. అందుకే చాలా సార్లు పోలీసులు కూడా రంగా వద్దకు వెళ్లమని బాధితులకు చెప్పేవారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన పోలీసులతో కూడా ఎన్నోసార్లు తలపడ్డారు. నేవీ అధికారి మురళీధరన్ లాకప్ డెత్ ,ఒక మహిళ శిరోముండనం కేసు, రిక్షా కార్మికుడిని పోలీసులు అరెస్ట్ చేసి వేధింపులకు గురిచేసినపుడు ఆయన పోలీసులకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడి బాధితుల తరపున నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 75 నియోజకవర్గాల్లో రంగా ప్రభావం ఉంది. రంగా విగ్రహాలను రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు .. తమిళనాడు, పాండిచ్చేరి, పలు ప్రాంతాల్లో నెలకొల్పారు. రంగా వర్దంతిని అమెరికాలో కూడా జరుపుతున్నారు. దీనిని బట్టే తెలుస్తోంది రంగా అందరి అభిమానం పొందిన నాయకుడని. రంగా కమ్మ,రెడ్డి ఆధిపత్యంలేని రాజ్యాధికారం రావాలని కోరుకునేవారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే చెబుతున్నారు కాబట్టి ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని గాళ్ల సుబ్రహ్మణ్యం వివరించారు.

ఇవి కూడా చదవండి: