SC Classification : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

SC Classification : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ అండగా ఉంటోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ, ప్రభుత్వంలో ఎస్సీలకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు.
బాబూ జగ్జీవన్‌రామ్‌కు కేంద్రంలో వివిధ శాఖల బాధ్యతలు అప్పగించి గౌరవించిందని గుర్తుచేశారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వ్యక్తి దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నియమించిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగిందని, దశాబ్దాలుగా జరిగిన పోరాటంలో ఎంతో మంది మాదిగ బిడ్డలు ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. 2004లో ఉషా మెహ్రా కమిటీ వేసి సమస్య పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగానే సమస్య పరిష్కారం కావడం సంతోషంగా ఉందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సూచన మేరకు షమీమ్ అక్తర్ కమిషన్ నియమించామని, కమిషన్ ప్రజల నుంచి 8,681 ప్రతిపాదనలు స్వీకరించిందన్నారు. కమిషన్ నివేదికను మార్చకుండా ఆమోదించామన్నారు. 59 ఎస్సీ ఉప కులాలను మూడు గ్రూపులుగా కమిషన్ విభజించిందన్నారు. 59 కులాలు ఇప్పటివరకు పొందిన ప్రయోజనాల ఆధారంగా కమిషన్ సిఫార్సులు చేసిందని సీఎం వివరించారు.
ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం భరోసా ఇచ్చారు. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీనిచ్చారు. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నారన్నారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ..
తెలంగాణ కేబినెట్ రేపు సమావేశం కానున్నది. ఉదయం 9.30 గంటలకు భేటీ అయి రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. ఈ తర్వాత ఉదయం 11.45 నిమిషాలకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.