MLC Kavitha: ముగిసిన కవిత ఈడీ విచారణ.. 9 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు
MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 9 గంటలపాటు కవితను అధికారులు ప్రశ్నించారు. ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు.
MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 9 గంటలపాటు కవితను అధికారులు ప్రశ్నించారు. ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు.
9 గంటలపాటు విచారణ.. (MLC Kavitha)
మద్యం కుంభకోణం కేసులో కవిత ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకు సాగింది. సుమారు 9 గంటలకు పైగా ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ మధ్యలో సాయంత్రం ఒక గంట విరామ సమయం ఇచ్చారు. అనంతరం 5 గంటల నుంచి తిరిగి విచారణ ప్రారంభించారు. జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో పీఎంఎల్‌ఏ50(2) ప్రకారం అనుమానితురాలిగా ఈడీ అధికారులు కవిత స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్టు సమచారం. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, విజయ్ నాయర్, మనీష్ సిసోదియా స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది. ఆధారాలు ధ్వంసం చేయడం, డిజిటల్ ఆధారాలు లభించకుండా చేయడం, హైదరాబాద్‌లో జరిగిన సమావేశాలపై ప్రధానంగా ఈడీ ఆరా తీసినట్టు తెలుస్తోంది.
చిరునవ్వుతో బయటకు వచ్చిన కవిత..
సుమారు 9 గంటలపాటు విచారణ అనంతరం.. ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చారు. కవిత కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు ఈడీ కార్యాలయం ఎదుట వేచి చూస్తున్నారు. ఒక్కసారిగా బయటకు వచ్చిన కవిత.. బీఆర్ఎస్ శ్రేణులకు నవ్వుతూ అభివాదం చేశారు. కవితను మీడియా మాట్లాడవలసిందిగా కోరగా.. ఆమె ఏమి మాట్లాడకుండా వెళ్లిపోయారు. కవిత తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసానికి వెళ్లిపోయారు.
కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని కేసీఆర్ అన్నారు. విచారణ పేరుతో కవితను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టొచ్చు. చేసుకుంటే చేసుకోనీ అందర్నీ వేధిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. న్యాయపోరాటం చేద్దాం, రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం అంటూ పార్టీ నాయకులతో కేసీఆర్ వ్యాఖ్యానించారు. అదే విధంగా నిన్న పార్టీ విస్తృత స్థాయి మీటింగ్ ముగియగానే కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
కవితకు మద్దతుగా పోస్టర్లు..
ఈడీ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. రెయిడ్స్ కి ముందు తర్వాత అంటూ పోస్టర్లను అతికించారు. ఎమ్మెల్సీ కవిత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా వీటిని రూపొందించారు. ప్రస్తుతం ఇవి అందరిని ఆకర్షిస్తున్నాయి. భాజపాలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ పలువురు భాజపా నేతల ఫొటోలతో నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు సీబీఐ, ఈడీ రెయిడ్స్ జరగగానే.. కాషాయరంగు పూసుకొని భాజపాలో చేరిపోయారంటూ ఫ్లెక్సీలతో విమర్శలు కురుస్తున్నాయి. ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, పశ్చిమ బెంగాల్ భాజపా ముఖ్యనేత సువేందు అధికారి, ఏపీకి చెందిన భాజపా నేత సుజనా చౌదరి, కేంద్ర మంత్రి నారాయణ్ రాణెతో పోలుస్తూ.. రెయిడ్స్‌కి ముందు తర్వాత ఎమ్మెల్సీ కవిత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు నగరంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మోదీని విమర్శిస్తూ కూడా హైదరాబాద్ లో పోస్టర్లు సైతం దర్శనమిచ్చాయి. ప్రధాని మోదీని రావణాసురుడితో పోలుస్తూ.. సీబీఐ, ఈడీ, ఐటీ, ఈసీ వంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ఈ పోస్టర్లను రూపొందించారు.