MLA Seethakka: ఇక నుంచి డాక్టర్ సీతక్క.. ఉస్మానియా వర్శిటీలో పీహెచ్‌డీ చేసిన ఎమ్మెల్యే సీతక్క
కాంగ్రెస్ పార్టీ నేత, ములుగు ఎమ్మెల్యే ధనిసిరి అనసూయ అలియాస్ సీతక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ సంపాదించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గుత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతుల పై అధ్యయనం చేసిన సీతక్క. ఆ అంశం పై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు
Hyderabad: కాంగ్రెస్ పార్టీ నేత, ములుగు ఎమ్మెల్యే ధనిసిరి అనసూయ అలియాస్ సీతక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ సంపాదించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గుత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతుల పై అధ్యయనం చేసిన సీతక్క. ఆ అంశం పై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. పొలిటికల్ సైన్స్‌లో ఆమె పూర్తి చేసిన ఈ పరిశోధనకే ఆమెకు వర్సిటీ అధికారులు మంగళవారం పీహెచ్‌డీ పట్టాను అందించారు.
ఓయూ మాజీ వైస్ ఛాన్స్ లర్ ప్రొ.తిరుపతిరావు పర్యవేక్షణలో ఆమె పీహెచ్ డీ పూర్తిచేశారు. పొలిటికల్ సైన్స్ లో పీహెచ్ డీ పూర్తి చేసేందుకు సహకరించిన హెచ్ఓడీ ప్రొఫెసర్ ముసలయ్య, ప్రొ. అశోక్ నాయుడు, ప్రొ. చంద్రు నాయక్ లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్‌గా ఉన్నప్పుడు తాను లాయర్ అవుతాననుకోలేదని, లాయర్‌గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవుతాననుకోలేదని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పీహెచ్‌డీ సాధిస్తానని అనుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు తనను డాక్టర్ సీతక్క అని పిలవొచ్చని కూడా ఆమె అన్నారు. ప్రజలకు సేవ చేయడం, జ్ఞానాన్ని పొందడం తనకు అలవాటని సీతక్క చెప్పారు. తన చివరి శ్వాస వరకు ఈ రెండింటిని కొనసాగిస్తానని అన్నారు.