Telangana Assembly : కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ ఏమన్నారంటే..

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడీగా కొనసాగుతున్నాయి. ఈ రోజు శాసన సభలో సభ్యులు ప్రాజెక్టుల గురించి అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌పై కీలక ప్రకటన చేశారు. 8 మృతదేహాలకు ఇప్పటి వరకు రెండు మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. మిగతా మృతదేహాలను బయటకు తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సభ దృష్టి తీసుకొచ్చారు. డీ-1, డీ-2 ప్రదేశాల్లో మట్టి తవ్వకాలు, డీ-వాటరింగ్‌ను బయటకు పంపే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, దక్షిణ మధ్య రైల్వే బృందాలు 24 గంటలపాటు శ్రమిస్తున్నాయని సభలో ప్రస్తావించారు.
ప్రాజెక్టుల నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం..
సహాయక చర్యలు పూర్తి కాగానే ఎస్ఎల్‌బీసీ సొరంగంతోపాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. అందుకు ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు పనులు ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్టు తమకు అందిందని తెలిపారు. ప్రాజెక్టు డీపీఆర్‌కు నిర్మాణానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఈ విషయంలో తాము ఎన్‌డీఎస్ఏ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌ను కలిసి ఎన్‌డీఎస్ఏ రిపోర్టు త్వరిగతిన ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కాళేశ్వరంపై జ్యుడీషియల్ విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు.