TGPSC : టీజీపీఎస్సీ గ్రూప్ 1, 2, 3 ఫలితాలు ఎప్పుడంటే?

TGPSC : తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు గ్రూప్ 1, 2, 3 ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తాజాగా టీజీపీఎస్సీ ఫలితాల విడుదలకు తేదీలు ఖరాయ్యాయి. శుక్రవారం జరిగిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల స్థితిని సమీక్షించడంతో పాటు ఇప్పటికే నిర్వహించిన పలు పరీక్షల జనరల్ ర్యాంకింగ్, ఫలితాల విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఫలితాల తేదీలు..
గ్రూప్- 1 ఉద్యోగ నియామక పరీక్షలో అభ్యర్థులు సాధించిన ప్రొవిజినల్ మార్కుల వివరాలను ఈ నెల 10న ప్రకటించనున్నారు. గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితా 11న, గ్రూప్- 3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను 14న విడుదల చేస్తారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను 17న, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలను 19న ప్రకటించనున్నారు. తెలంగాణలో 563 గ్రూప్-1 ఉద్యోగాలు, 783 గ్రూప్-2, 1,365 గ్రూప్-3 పోస్టులతోపాటు 581 వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు గతంలో పరీక్షలు నిర్వహించింది.
తప్పుడు సమాచారం నమ్మొద్దు..
గ్రూప్-1 ఉద్యోగ నియామకాలపై ఎలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని టీజీపీఎస్సీ విజ్ఞప్తి చేసింది. ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపికకు అన్ని నియమాలు పాటిస్తుందని స్పష్టం చేసింది. ఎవరైనా మధ్యవర్తులు కమిషన్ సిబ్బంది, ఇతర అధికారులతో పరిచయాలు ఉన్నాయని సహాయం చేస్తామని సంప్రదిస్తే అభ్యర్థులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పేర్కొంది. సమాచారాన్ని పోలీసు కంప్లయింట్‌తో కలిపి కమిషన్‌కు ఫిర్యాదు చేసేలా ఫోన్ నంబర్ (99667-00339), ఈ మెయిల్ ఐడీ (vigilance@tspsc.gov.in) ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది.
పారదర్శకంగా పరీక్షలు..
ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన మధ్యవర్తుల గురించి ఇప్పటివరకు కమిషన్‌కు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలు పూర్తిగా నిరాధారమని తెలిపింది. కేవలం కమిషన్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశం ఉందని పేర్కొంది. అలాంటి వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కమిషన్ వెనుకాడబోదని స్పష్టం చేసింది. పరీక్షల్లో పారదర్శకమైన నియామక విధానాలను అనుసరిస్తుందని, ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం కోరారు.