Last Updated:

Kadiam Srihari: ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధం.. ఫిరాయింపులపై బీఆర్ఎస్‌కు మాట్లాడే హక్కు లేదు

Kadiam Srihari: ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధం.. ఫిరాయింపులపై బీఆర్ఎస్‌కు మాట్లాడే హక్కు లేదు

Kadiyam Srihari Press Meet in Hanumakonda about by-elections: ఎమ్మెల్యేల అనర్హత పిటిషిన్‌పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 10న తీర్పు రాబోతుందని చెప్పారు. ఆదివారం హనుమకొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. కోర్టు తీర్పును తప్పకుండా శిరసావహిస్తానని చెప్పారు. ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. అందులో వెనక్కి పోయేది లేదని, వేరే ఆలోచన కూడా తనకు లేదన్నారు.

బీఆర్ఎస్ స్వార్థ రాజకీయాలు..
బీఆర్ఎస్ స్వార్థ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిదని హితవు పలికారు. గత పదేళ్లలో 36 మంది ఎమ్మెల్యేను బీఆర్ఎస్‌లో చేర్చుకొని మంత్రులను కూడా చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు సుద్ధపూసలాగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. బీఆర్ఎస్‌కు ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ చేస్తే సంసారం.. తాము చేస్తే వ్యవభిచరమా? అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు.

ఆప్ ఓడిపోవడానికి బీఆర్ఎస్సే కారణం..
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతోషపడుతున్నారన్నారు. ఆప్ ఓడిపోవడానికి బీఆర్ఎస్ పార్టే ప్రధాన కారణమని చెప్పారు. లిక్కర్ స్కాంతో ఆప్ ఓడిపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్‌తో ఆప్ స్నేహం చేయడంతోనే అధికారం కోల్పోయిందన్నారు. ఆప్, కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేస్తే బాగుండేదన్నారు. ఈ ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవాలని సూచించారు. ఆప్ అతిగా ఆలోచించుకొని ఒంటరిగా పోటీ చేసిందని తెలిపారు.

కవితపై విమర్శలు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్లే ఆప్ ఓడిపోయిందని, దానికి ముఖ్య కారణం ఎమ్మెల్సీ కవితనే అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కేజ్రీవాల్, కవితను మరోసారి జైలుకు వెళ్తారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ మొత్తాన్ని బయటకు తీస్తామని బీజేపీ నేతలు ప్రకటించగా, సీఎం ఆఫీసు నుంచి ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లొద్దని, హార్డ్ డిస్క్, మెయిల్స్ తదితర ఏ ఆధారం ఆఫీసు దాటి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయడం దేశరాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.